అద్వానీకి తీవ్ర అస్వస్థత .. ఏయిమ్స్ లో చేరిక

అద్వానీకి తీవ్ర అస్వస్థత .. ఏయిమ్స్ లో చేరిక
మాజీ ఉప ప్రధాని, బీజేపీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ బుధవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. వృద్ధాప్య సంబంధిత సమస్యల కారణంగా ఆయన అడ్మిట్ అయ్యారు. వృద్ధాప్య సమస్యల విభాగానికి సంబంధించిన వైద్యుల పర్యవేక్షణలో అద్వానీ ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. 
 
ప్రధాని నరేంద్ర మోదీ ఏయిమ్స్ వైద్యులతో అద్వానీ ఆరోగ్యం పై ఆరా తీసారు. 96 ఏళ్ల అద్వానీ ప్రస్తుతం స్థిరంగా ఉన్నారని, పరిశీలనలో ఉన్నారని ఆసుపత్రి ఒక ప్రకటనలో ధృవీకరించింది. కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఆసుపత్రికి చేరుకొని   సీనియర్ బీజేపీ నేత ఆరోగ్య పరిస్థితి గురించి అద్వానీ కుటుంబం, ఎయిమ్స్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
 
నడ్డా అద్వానీ కుమారుడు జయంత్, కుమార్తె ప్రతిభలతో మాట్లాడి ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారు. వివరణాత్మక నివేదిక కోసం  ఎయిమ్స్‌ డైరెక్టర్ ఎం శ్రీనివాస్‌ను సంప్రదించారు.
 
“ఎల్‌కె అద్వానీని న్యూఢిల్లీలోని  ఎయిమ్స్‌ లో చేర్పించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన పరిశీలనలో ఉన్నారు” అని  ఎయిమ్స్‌ ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలిపింది. అయితే  మరిన్ని వివరాలను అందించలేదు. వృద్ధాప్య విభాగానికి చెందిన నిపుణుల క్రింద వయస్సు సంబంధిత ఆరోగ్య సమస్యలకు ఆయన చికిత్స పొందుతున్నారు.
 
అద్వానీకి యూరాలజీకి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. యూరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ అమలేష్ సేథ్ ఆధ్వర్యంలో ఆయన చికిత్స పొందుతున్నారు. అద్వానీ మెడికల్ బులెటిన్‌ను ఎయిమ్స్ వైద్యులు, వైద్య నిపుణులు త్వరలో విడుదల చేయనున్నారు. కాగా ఆయన ఆరోగ్యం బాగానే ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.
 
ఎల్‌కే అద్వానీ దేశ అత్యున్నత పౌర గౌరవ పురస్కారమైన భారతరత్నను ఈ ఏడాది 2024లోనే స్వీకరించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎల్‌కే అద్వానీ నివాసానికి వెళ్లి భారతరత్నతో సత్కరించారు. అద్వానీ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆయన నివాసంలోనే ఆయనకు భారతరత్నను ప్రదానం చేశారు. మోదీ మూడోసారి ప్రధానిగా ఎంపిక అయిన తరువాత అద్వానీ నివాసానికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిసారు.

ఎల్‌కే అద్వానీ 1927 నవంబర్ 8న ప్రస్తుత పాకిస్థాన్‌లోని కరాచీలో జన్మించారు. సెప్టెంబర్ 12, 1947న పాకిస్థాన్‌ను విడిచిపెట్టి అతని కుటుంబం భారతదేశానికి వచ్చిందని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. లాల్ కృష్ణ అద్వానీకి ఒక కుమార్తె ప్రతిభా అద్వానీ, కుమారుడు జయంత్ అద్వానీ ఉన్నారు. అద్వానీ కొడుకు, కుతురు ఇద్దరూ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 

కరాచీలోని సెయింట్ పాట్రిక్స్ స్కూల్ నుంచి తన ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. విభజన తర్వాత భారతదేశంలోని ముంబైలోని ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి న్యాయ పట్టా అందుకున్నారు. అద్వానీ ఫిబ్రవరి 25, 1965న కమల అద్వానీని వివాహం చేసుకున్నారు. అద్వానీ దేశభక్తి కారణంగా ఆర్‌ఎస్‌ఎస్‌ వైపు మొగ్గు చూపారు.

దేశ విభజన తర్వాత కరాచీ నుంచి ఢిల్లీకి వచ్చి రాజస్థాన్‌లో ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌గా చాలా కాలం పనిచేశారు. ఆ తర్వాత భారతీయ జనసంఘ్ అధ్యక్షునిగా పనిచేశారు. బిజెపి వ్యవస్థాపక సభ్యునిగా సుదీర్ఘకాలం పార్టీ అధ్యక్షునిగా ఉన్నారు. మూడు దశాబ్దాలకు మించిన పార్లమెంటరీ జీవితంలో కేంద్ర ప్రభుత్వంలో సమాచారశాఖ, హోమ్ శాఖల మంత్రిగా, ఉప ప్రధానిగా పనిచేశారు.