పఠాన్‌ కోట్‌ లో ఉగ్రవాదుల సమాచారం… హై అలెర్ట్

* దోడా జిల్లాలో ముగ్గురు ఉగ్రవాదులు హతం

ఇటీవల కొన్ని రోజులుగా జమ్మూ కాశ్మీర్‌‌లో రెచ్చిపోతున్న ఉగ్రవాదులు ఆ పక్కనే ఉన్న పంజాబ్‌లోకి ప్రవేశించినట్లు భద్రతా బలగా భారత వాయుసేన కీలక స్థావరం ఉన్న ప లు గుర్తించాయి. కీలకమైన పంజాబ్, జమ్మూ కాశ్మీర్‌ సరిహద్దుల్లో ఉన్న పఠాన్‌కోఠ్ జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులు భారీగా ఆయుధాలతో సంచరిస్తున్నట్లు గుర్తించడంతో బుధవారం జిల్లాలో హై అలర్ట్‌ను ప్రకటించారు. 
 
పలు గ్రామాల్లో దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. బోర్డర్‌ రేంజి డీఐజీ రాకేశ్‌ కుశాల్‌ మాట్లాడుతూ మంగళవారం రాత్రి అనుమానాస్పద కదలికలను గుర్తించామని, ఆ ప్రాంతాన్ని పూర్తిగా కట్టుదిట్టపరిచామని తెలిపారు. ఇప్పటికే బీఎస్‌ఎఫ్‌, సహా అన్ని సెక్యూరిటీ ఏజెన్సీలకు అలర్ట్‌లు జారీ చేశామని చెప్పారు.
 
 పఠాన్‌కోట్‌ ఎస్‌ఎస్‌పీ సుహైల్‌ ఖాసీంమిర్‌ ఈ వివరాలను వెల్లడిస్తూ ఇద్దరు సాయుధులు కోట్‌ భట్టియాన్‌ గ్రామ పరిసరాల్లో సంచరిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. ఈ ప్రాంతం జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లాతో సరిహద్దులు పంచుకుంటోందని చెప్పారు. ఈ అనుమానితులే కథువాలోని కోట్‌ పన్నూలో కూడా సంచరించినట్లు తెలిసిందని వెల్లడించారు. 
 
ఈ నెల 12వ తేదీన పాక్‌ నుంచి కథువా జిల్లా సుక్‌పాల్‌ గ్రామంలోకి చొరబడిన ఇద్దరు అనుమానితులను భద్రతా దళాలు కాల్చిచంపాయి. గతంలో 2016 జనవరిలో పఠాన్‌కోట్‌లోని వాయుసేన స్థావరంపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. అప్పట్లో కూడా వారు ముందుగా వీధుల్లో తిరుగుతూ వాహనాలను హైజాక్‌ చేసి ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌లోకి ప్రవేశించారు. 
 
ఆ తర్వాత అక్కడే భారీగా పెరిగిన గడ్డిలో దాక్కున్నారు. తెల్లవారుజామున సిబ్బంది క్వార్టర్స్‌లోకి ప్రవేశించి దాడి చేసి పలువురి ప్రాణాలను బలిగొన్నారు. వీరిని పూర్తిస్థాయిలో మట్టుబెట్టడానికి కొన్ని రోజులు వాయుసేన, ఇతర భద్రతా దళాలు శ్రమించాల్సి వచ్చింది. అయితే, నాడు ఎయిర్‌ఫోర్స్‌ కీలక ఆయుధ సంపత్తికి ఎలాంటి నష్టం జరగలేదు.
 
ఇలా ఉండగా, జమ్మూ కశ్మీర్‌లో బుధవారం ఉదయం దోడా జిల్లాలోని అటవీ ప్రాంతంలో చోటు చేసుకున్న ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల కదలికలపై నిఘా కోసం ఆర్మీ హెలికాప్టర్‌ను కూడా రంగంలోకి దింపారు. ఈనెల 11, 12 తేదీల్లో ఇక్కడి కొండ ప్రాంతంలో జంట ఉగ్రదాడులు చోటుచేసుకోవడంతో ఆర్మీ, సీఆర్‌పీఎఫ్ బలగాలు ఆ ప్రాంతంలో జల్లెడపడుతున్నాయి. 
 
చాత్తర్‌గల్లాలోని జాయింట్ చెక్‌పోస్ట్‌పై జూన్ 11న ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఆరుగురు భద్రతా సిబ్బంది గాయపడగా, ఆ మరుసటి రోజు కోటా టాప్‌లోని గందోహ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో ఒక పోలీసు గాయపడ్డారు. నలుగురు పాకిస్తాన్ టెర్రరిస్టులు ఈ ఉగ్ర ఆపరేషన్ జరిపినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
ఒక్కొక్కరి ఆచూకీ చెప్పిన వారికి రూ.5 లక్షల చొప్పున రివార్డును కూడా ప్రకటించారు. సినో పంచాయత్‌లో భద్రతా బలగాల సహకారంతో పోలీసులు గాలింపు చర్యలు జరుపుతుండగా, అక్కడ తలదాచుకున్న ఉగ్రవాదులు కాల్పులకు తెగబడుతున్నారు

కాగా, రాజౌరి జిల్లా పిండ్ గ్రామంలోని చింగుస్ ప్రాంతం నుంచి భద్రతా బలగాలు ఒక చైనా హ్యాండ్ గ్రనేడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. భద్రతా బలగాల గస్తీ బృందానికి మంగళవారం సాయంత్రం ఈ గ్రనేడ్ కనిపించినట్టు అధికారులు తెలిపారు.