ఓవైసీ ఎంపీ సభ్యత్వం రద్దుకై రాష్ట్రపతికి ఫిర్యాదు

లోక్‌సభలో ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఎంపీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రమాణ స్వీకారం చివర్లో `జై పాలస్తీనా’ అని అసదుద్దీన్ ఓవైసీ అనడం పట్ల అధికార బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అసద్‌పై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నేతలు స్పీకర్‌కు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. 
 
మరోవైపు ఇదే వ్యవహారంపై కొందరు న్యాయవాదులు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూకు కూడా ఫిర్యాదు చేశారు.  మంగళవారం లోక్‌సభలో ప్రమాణ స్వీకారం చేసిన అసదుద్దీన్ ఓవైసీ.. చివర్లో జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా అంటూ నినాదాలు చేశారు. అయితే మన దేశ లోక్‌సభలో జై పాలస్తీనా అనడాన్ని బీజేపీ నేతలు తీవ్రంగా తప్పపడుతున్నారు. 
 
ఈ క్రమంలోనే అసదుద్దీన్ చేసిన నినాదంపై లోక్‌సభలో కొద్దిసేపు తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో అసదుద్దీన్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రకటించడంతో తాత్కలికంగా శాంతించారు. అయితే ప్రస్తుత నిబంధనల ప్రకారం పాలస్తీనాకు కట్టుబడి ఉన్నందుకు అసదుద్దీన్ ఒవైసీ తన లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడు అంటూ బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. 
 
అంతేకాకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్ 102 (డీ) ప్రకారం అసదుద్దీ్న్ ఓవైసీపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు.  ఇక ఇదే అంశంపై దేశంలోని పలువురు న్యాయవాదులు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు కూడా ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు లాయర్ అలఖ్ అలోక్ శ్రీవాస్తవ పాలస్తీనాకు అనుకూలంగా లోక్‌సభలో అసదుద్దీన్ ఓవైసీ నినాదం చేయడంపై రాష్ట్రపతికి చేసిన ఫిర్యాదులో తీవ్ర అభ్యంతరం తెలిపారు. 
 
ఇది భారతదేశ సమగ్రతకు, విధేయతకు సంబంధించిన అంశమని, కానీ ఆయన విదేశానికి కట్టుబడి ఉన్నానని పార్లమెంట్ సాక్షిగా అంగీకరించడమేనని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 102 (డీ) ప్రకారం అసదుద్దీన్ ఓవైసీ తక్షణమే పార్లమెంట్ సభ్యుడిగా అనర్హుడని ఆ ఫిర్యాదులో తెలిపారు. పాలస్తీనా పట్ల అసదుద్దీన్ ఓవైసీ విధేయతను చూపుతున్నారని, ఇలా వ్యవహరించడం తొలిసారి కాదని మండిపడ్డారు. సీనియర్ లాయర్ విష్ణు శంకర్ జైన్ కూడా ఓవైసీపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు.