దేశంలో మళ్లీ జికా వైరస్ కలకలం

మహారాష్ట్రలో ఒకే కుటుంబంలో 2 జికా వైరస్ కేసులు వెలుగు చూడటం ప్రస్తుతం తీవ్ర సంచలనంగా మారింది. పూణెకు చెందిన ఓ డాక్టర్, ఆయన కుమార్తెకు జికా వైరస్ పాజిటివ్‌గా మెడికల్ టెస్ట్‌ల్లో తేలినట్లు డాక్టర్లు తెలిపారు. ఒకే ఇంట్లో ఇద్దరికీ జికా వైరస్ సోకడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఆ పరిసరాల్లో జికా వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
ప్రస్తుతం ఆ డాక్టర్, ఆయన కుమార్తె ఆరోగ్య పరిస్థితి సాధారణంగానే ఉండటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కొన్ని రోజుల క్రితం ఆ డాక్టర్‌‌ జ్వరం బారిన పడగా.. తగ్గకపోవడంతో ఆస్పత్రిలో చేరాడు. ఆ తర్వాత వేరే లక్షణాలు కనిపించడంతో రక్త నమూనాలను తీసి ల్యాబ్‌కు పంపించగా.. జికా వైరస్ సోకినట్లు తేలింది.

శరీరంపై దద్దుర్లు రావడంతో ఆస్పత్రిలో చేరిన ఆ డాక్టర్ బ్లడ్ శాంపిల్స్ సేకరించిన ఆస్పత్రి వర్గాలు.. పూణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి పంపించారు. ఈ నెల 21వ తేదీన ఆ 46 ఏళ్ల డాక్టర్‌కు జికా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయినట్లు పూణె మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు వెల్లడించారు. 

 
ఈ కేసు వెలుగు చూడటంతో ఆ డాక్టర్ కుటుంబ సభ్యులకు కూడా బ్లడ్ టెస్ట్‌లు చేయగా.. అతని 15 ఏళ్ల కుమార్తెకు కూడా జికా వైరస్ పాజిటివ్‌గా తేలింది. మిగిలిన వారికి జికా వైరస్ సోకలేదని అధికారులు తెలిపారు. వారిద్దరికీ జికా వైరస్ సోకడంతో.. ఇరుగు పొరుగున ఉన్నవారికి ఏవైనా లక్షణాలు ఉన్నాయా అని అధికారులు ఆరా తీస్తున్నారు.
 
జికా వైరస్ సోకితే కొందరిలో తేలికపాటి లక్షణాలు కనిపిస్తాయి. మరి కొంతమందికి ఎలాంటి లక్షణాలు కనిపించవు. దీంతో వైరస్‌ని గుర్తించడం కష్టంగా మారుతుంది. సాధారణంగా జ్వరం, తలనొప్పి, దద్దుర్లు, కీళ్లు.. కండరాల నొప్పి, కళ్ళ మంట, అలసట, పొత్తి కడుపులో నొప్పి ఉంటుంది. వైరస్‌ దోమల కారణంగా వస్తుంది. దోమలు కుట్టకుండా జాగ్రత్త తీసుకోవాలి. నిండుగా బట్టలు వేసుకోవాలి. 
 
ఇంట్లోకి దోమలు రాకుండా ఇంటి తలుపులు, కిటికీలకు మెష్‌ని ఏర్పాటు చేసుకోవడం మంచింది. అదే విధంగా దోమల వికర్షణ లేపనాలు వాడాలి. వైరస్ సోకిన వారికి దూరంగా ఉండాలి. వైరస్‌ సోకిన వ్యక్తులను ముద్దుపెట్టుకోవడం, ముట్టుకోవడం, లైంగిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. ఆయా వ్యక్తుల దగ్గరికి వెళ్లి వస్తే చేతులను శుభ్రంగా కడగాలి. తప్పనిసరిగా మాస్క్‌ను వాడాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.