జైల్లోనే కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన సీబీఐ

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ బెయిల్‌ పిటిషన్‌ సుప్రీంకోర్టులో బుధవారం విచారణకు రానున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకొన్నది. ప్రస్తుతం తీహార్‌ జైల్లో ఉన్న ఆయన్ను సీబీఐ మద్యం పాలసీకి సంబంధించిన కేసులో మంగళవారం అరెస్టు చేసింది. సీబీఐ అధికారులు సోమవారం జైల్లోనే కేజ్రీవాల్‌ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. 
 
సీబీఐ కేజ్రీవాల్‌ను బుధవారం ట్రయల్‌ కోర్టులో ప్రవేశపెట్టనున్నదని సంబంధిత వర్గాలు తెలిపాయి. సుప్రీంకోర్టు నుంచి 100 శాతం బెయిల్‌ వస్తుందని భావిస్తున్న తరుణంలో కేంద్రం కుట్రలు చేస్తున్నదని ఆప్‌ రాజ్యసభ ఎంపీ సంజయ్‌ సింగ్‌ ఆరోపించారు.
 
మరోవంక, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు రౌస్‌ అవెన్యూ కోర్టు మంజూరు చేసిన బెయిలుపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన కేజ్రీవాల్‌ తిహాడ్‌ జైల్లో ఉన్నారు. ట్రయల్‌ కోర్టు ఈ నెల 20న కేజ్రీవాల్‌కు సాధారణ బెయిలు మంజూరు చేసింది. దీన్ని సవాలు చేస్తూ ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. 
 
ట్రయల్‌ కోర్టు ఏకపక్షంగా వ్యవహరించిందని, తమకు వాదనలు వినిపించడానికి తగిన సమయం కూడా ఇవ్వలేదని తెలిపింది. కేజ్రీవాల్‌కు మంజూరు చేసిన బెయిల్‌పై స్టే ఇవ్వాలని కోరింది. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ సుధీర్‌కుమార్‌ జైన్‌ నేతృత్వంలోని వెకేషన్‌ బెంచ్‌ మంగళవారం విచారణ జరిపింది. 
 
కేజ్రీవాల్‌కు బెయిలు మంజూరు చేసే విషయంలో ట్రయల్‌ కోర్టు కనీస ఆలోచన చేయలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈడీ సమర్పించిన పత్రాలను జడ్జి సరిగా పరిశీలించలేదని, దర్యాప్తు సంస్థ లేవనెత్తిన అభ్యంతరాలనూ పట్టించుకోలేదని పేర్కొంది. బెయిలు పిటిషన్‌పై వాదనలు వినిపించేందుకు ఈడీకి సరైన అవకాశం కల్పించలేదని న్యాయమూర్తి జస్టిస్‌ జైన్‌ పేర్కొన్నారు. 
 
మనీలాండరింగ్‌ అంశంలో దర్యాప్తు సంస్థ వాదనలను, లిఖితపూర్వక సమర్పణలను ట్రయల్‌ కోర్టు జడ్జి పరిగణనలోకి తీసుకోలేదని.. వాటిపై చర్చించనూ లేదని వ్యాఖ్యానించారు. ట్రయల్‌ కోర్టు ఇచ్చిన సాధారణ బెయిలుపై స్టే విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ తీర్పుతో కేజ్రీవాల్‌ ప్రస్తుతానికి తిహాడ్‌ జైలుకే పరిమితం కావాల్సి ఉంటుంది. ఢిల్లీ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆప్‌ వర్గాలు మంగళవారం వెల్లడించాయి. కాగా, తన బెయిలు విషయమై కేజ్రీవాల్‌ ఇప్పటికే దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరగనుంది. ఇదిలా ఉండగా, బెయిలు పిటిషన్లపై విచారణలో అనవసరంగా వాయిదాలు వేయొద్దని సుప్రీంకోర్టు సూచించింది. మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన ఆప్‌ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌ బెయిలు పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు తదుపరి విచారణ జరిగే రోజు నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది. జూలై 9న ఢిల్లీ హైకోర్టులో జైన్‌ బెయిలు పిటిషన్‌పై విచారణ జరగనుంది.