రాజ్ నాథ్ సింగ్ తో సీఎం రేవంత్ భేటీ

రాజ్ నాథ్ సింగ్ తో సీఎం రేవంత్ భేటీ
ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఎంపీలతో కలిసి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై కేంద్ర మంత్రితో చర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి మాట్లాడారు. తెలంగాణలోని వివిధ రక్షణ శాఖ భూముల బదలాయింపుపై సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్‌లో రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కోసం రక్షణ శాఖ భూమిని అప్పగించాలని కోరారు. అలాగే, కరీంనగర్, రామగుండం కనెక్టివిటీ కోసం రక్షణ శాఖ భూముల అప్పగింతపై కూడా విజ్ఞప్తి చేశారు. ప్యారడైజ్ నుంచి బోయినపల్లి, సుచిత్ర రహదారిలో రోడ్డు చిన్నగా ఉండి, ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది. ఈ మార్గంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కోసం రక్షణ శాఖ భూమిని అప్పగించాలని కోరారు. అలాగే, కొన్ని జిల్లాల్లో సైనిక్ స్కూల్స్ పెంపు కోసం విజ్ఞప్తి చేశారు. 
 
మరోవైపు, కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి ఖట్టర్‌ను సీఎం రేవంత్ కలవనున్నారు. రైతులకు రూ.2 లక్షల వరకూ పంటరుణాలు మాఫీ చేయడానికి రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటికే ఆమోదం తెలిపింది. దీనికి అవసరమైన రూ.31 వేల కోట్లను రుణాలుగా సేకరించేందుకు ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ అంశంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితో లేదా ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి భేటీ కానున్నట్లు సమాచారం. 
 

మరోవంక, తెలంగాణకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో బీఎల్‌సీ మోడల్‌లో 2.70 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని ఆ తర్వాత కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌ ను కలిసి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. నిరుపేద‌లకు వారి సొంత స్థ‌లాల్లో 25 ల‌క్ష‌ల ఇళ్లు నిర్మించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింద‌ని కేంద్ర మంత్రి దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. 

 
రాష్ట్రంలో తాను నిర్మించాలనుకుంటున్న 25 లక్షల ఇళ్లలో 15 లక్షల ఇళ్లు పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోకి వస్తాయని, వాటిని లబ్ధిదారుల నేతృత్వంలో వ్యక్తిగత (బీఎల్‌సీ) గృహ నిర్మాణం కింద నిర్మిస్తామని కేంద్ర మంత్రికి వివరించారు.

పీఎంఏవై కింద ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ‌కు 1,59,372 ఇళ్లు మంజూరు చేసి రూ.2,390.58 కోట్లు గ్రాంటు కింద ప్ర‌క‌టించార‌ని ముఖ్య‌మంత్రి గుర్తు చేశారు. అయితే ఇందులో ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం రూ.1,605.70 కోట్లు మాత్ర‌మే విడుద‌ల చేశార‌ని, మిగ‌తా నిధులు విడుద‌ల చేయాల‌ని కేంద్ర మంత్రి ఖ‌ట్ట‌ర్‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కోరారు.