లోక్‌సభ సమావేశాలు నేటి నుంచే

18వ లోక్‌సభ తొలి సమావేశాలు సోమవారం నుంచి జరుగనున్నాయి. 24, 25 తేదీల్లో ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో కొత్తగా ఎంపీలుగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ తర్వాత 26న లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక జరుగుతుంది. అనంతరం 27న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
 
తొలి రోజు ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణం చేస్తారు. ఆయనతో పాటు మొత్తం 280 మంది లోక్‌సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరితో ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మహతాబ్‌ ప్రమాణం చేయిస్తారు. స్పీకర్‌ ఎన్నిక జరిగే వరకు ప్రొటెం స్పీకర్‌కు సహాయంగా సురేష్‌ కోడికున్నిల్‌, టీఆర్‌ బాలు, రాధామోహన్‌ సింగ్‌, ఫగ్గన్‌ సింగ్‌ కులస్తే, సుదీప్‌ బంధోపాధ్యాయ వ్యవహరిస్తారు. రెండో రోజు 264 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఒక్కో ఎంపీ ప్రమాణానికి ఒక నిమిషం సమయం ఉంటుంది.
 
ప్రధాని మోదీ క్యాబినెట్‌లోని మంత్రుల్లో 58 మంది లోక్‌సభ సభ్యులు, 13 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. మంత్రి రవ్‌నీత్‌ సింగ్‌ బిట్టు లూధియానా నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆయన ఏ సభలోనూ సభ్యుడు కాకపోవడం గమనార్హం. లోక్‌సభ సమావేశాలు జూలై 3 వరకు కొనసాగనున్నాయి. కాగా, లోక్‌సభలో తొలి రోజే ఏపీకి చెందిన 25 మంది సభ్యులు ప్రమాణం చేయనుండగా, రెండో రోజు తెలంగాణకు చెందిన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు. మూడో రోజైన 26న లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక ఉంటుంది.
 
రాష్ట్రపతి ప్రసంగ ధన్యవాద తీర్మానంపై చర్చ జూన్‌ 28న ప్రారంభం అవుతుందని, ప్రధాని మోదీ జూలై 2 లేదా 3న చర్చకు సమాధానం ఇచ్చే అవకాశం ఉన్నదని పార్లమెంట్‌ వర్గాలు తెలిపాయి. రాష్ట్రపతి ముర్ము సోమవారం రాష్ట్రపతి భవన్‌లో ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన భర్తృహరి మహతాబ్‌ చేత ప్రమాణం చేయించనున్నారు.

రాజ్యాంగంలోని 93వ ఆర్టికల్‌ ప్రకారం లోక్‌సభ స్పీకర్‌ను ఎన్నుకుంటారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి దాకా లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవంగానే జరుగుతూ వస్తోంది. సహజంగా అధికార పక్షానికి చెందిన ఎంపీకి స్పీకర్‌ పదవి, ప్రతిపక్షాలకు చెందిన అభ్యర్థికి డిప్యూటీ స్పీకర్‌ పదవి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి ప్రతిపక్షాలకు ఇచ్చే ఉపసభాపతి పదవిని తమకు ఇవ్వాలని ఇండియా కూటమి డిమాండ్‌ చేస్తోంది. 17వ లోక్‌సభలో బీజేపీకి చెందిన ఓంబిర్లా స్పీకర్‌గా ఉన్నారు. ఉపసభాపతి స్థానానికి ఎవరినీ ఎంపిక చేయకపోవడం వల్ల ఆ పదవి ఐదేళ్లు ఖాళీగా ఉంది.

కాగా, ఈ సమావేశాల తర్వాత స్వల్ప విరామం అనంతరం జూలై 22న పూర్తి స్థాయి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ఉభయ సభలు తిరిగి సమావేశం కానున్నాయని పార్లమెంట్‌ వర్గాలు వెల్లడించాయి.