నీట్‌ పేపర్‌ లీకేజీ వివాదంపై రంగంలోకి దిగిన సీబీఐ

* దర్యాప్తును స్వాగతించిన ఐఎంఏ

నీట్‌ యూజీ పేపర్‌ లీకేజీ వివాదాల నేపథ్యంలో సీబీఐ రంగంలోకి దిగింది. నీట్‌ నిర్వహణలో అవకతవకలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నీట్‌ వ్యవహారంపై విచారణ మొదలుపెట్టిన సీబీఐ బిహార్‌లో జరిగిన పేపర్‌ లీక్‌తో పాటు గ్రేస్‌ మార్కుల వ్యవహారంపై దర్యాప్తును వేగవంతం చేసింది.

నీట్ పరీక్షలో అక్రమాలు జరిగినట్టు వస్తోన్న ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారించనుంది. అలాగే బీహార్‌లో పేపర్ లీక్ , పలుచోట్ల విద్యార్థులు సమయం కోల్పోయారంటూ వారికి గ్రేస్ మార్కులు కలపడం వంటి అంశాల పైనా విచారించనుంది. కేంద్ర విద్యాశాఖ సూచనల మేరకు నమోదు చేసిన ఈ కేసులో నిందితులుగా గుర్తు తెలియని వ్యక్తులను చేర్చినట్టు తెలిపింది.

ఐపీసీ సెక్షన్‌ 120-బీ(నేరపూరిత కుట్ర), 420(మోసం) కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. పేపర్‌ లీక్‌ ఆరోపణలతో కేసులు నమోదైన బీహార్‌ రాజధాని పట్నాకు, గుజరాత్‌లోని గోద్రాకు రెండు సీబీఐ బృందాలు వెళ్లాయి. ఈ రెండు రాష్ర్టాల్లో పోలీసులు నమోదు చేసిన కేసుల విచారణను తమ పరిధిలోకి తీసుకోవడానికి చర్యలు తీసుకుంటున్నట్టు సీబీఐ అధికార ప్రతినిధి తెలిపారు.

బీహార్ లో సీబీఐ అధికారులపై దాడి!

ప్రశ్నాపత్రం లీక్‌ కేసులో విచారణకు వెళ్లిన సీబీఐ అధికారుల బృందంపై బీహార్‌లో దాడి జరిగినట్టు తెలుస్తున్నది. ఈ కేసులో విచారణ జరిపేందుకు శనివారం సాయంత్రం బీహార్‌లోని నవాడా సమీపంలో ఉన్న కసియాదేహ్‌ గ్రామానికి సీబీఐ అధికారులు వెళ్లారు. ఈ విషయాన్ని గుర్తించిన కొందరు స్థానికులు సీబీఐ వాహనాల చుట్టూ గుమిగూడి, అధికారులతో వాగ్వాదానికి దిగారు. 

దీంతో సీబీఐ అధికారులు స్థానిక రాజౌలి పోలీస్‌ స్టేషన్‌కు ఫోన్‌ చేయగా పోలీసులు వచ్చి స్థానికులను అడ్డుకున్నారు. ప్రభుత్వ పనికి అడ్డంకులు కల్పించడం, దాడి చేయడం వంటి ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేసి నలుగురిని అరెస్టు చేశారు. నీట్‌-యూజీ పరీక్షలకు సంబంధించిన ఆరోపణలపై విచారణ జరుపుతున్న బీహార్‌ ఆర్థిక నేరాల విచారణ విభాగం కొత్త విషయాన్ని గుర్తించింది. పరీక్షపత్రాలను ఎన్‌టీఏ డిజిటల్‌ లాక్‌లు కలిగిన ప్రత్యేక బాక్సుల్లో పరీక్షా కేంద్రాలకు పంపిందని, కానీ ఇవి తీరా పరీక్ష మొదలయ్యే సమయానికి తెరుచుకోలేదని పేర్కొన్నది. 

వాస్తవానికి ఇవి పరీక్ష ప్రారంభానికి ముందు ఆటోమెటిక్‌గా తెరుచుకోవాలి. కానీ, పలు కేంద్రాల్లో డిజిటల్‌ లాక్‌లు పని చేయకపోవడంతో మాన్యువల్‌గా బాక్సులను తెరవాల్సి వచ్చింది. దీంతో విద్యార్థులకు ఆలస్యంగా ప్రశ్నాపత్రాలు అందాయి. దేశవ్యాప్తంగా దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు రాసిన ఈ పరీక్షలో అక్రమాలు, మోసాలు, జరిగాయని పలుచోట్ల కేసులు నమోదైనట్టు కేంద్ర విద్యామంత్రిత్వశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

దీనిపై ఉన్నత స్థాయి సమీక్ష అనంతరం పరీక్షల ప్రక్రియలో పారదర్శకత కోసం ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేసేందుకు సీబీఐకి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్లు సదరు అధికారి వెల్లడించారు. నీట్‌ యూజీ పేపర్‌ లీక్‌ వ్యవహారాలపై విమర్శలు వెల్లువెత్తుతుండటంతో కేంద్ర ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయాలు తీసుకుంది. మొదటగా నీట్‌ పరీక్షను నిర్వహించిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్టీయే ) ప్రక్షాళనకు ఉన్నతస్థాయి కమిటీని వేసింది. 

ఆ తర్వాత ఎన్టీయే డైరెక్టర్‌ జనరల్‌ సుబోధ్‌ సింగ్‌ను పదవి నుంచి తొలగించింది. ప్రస్తుతం ఇండియా ట్రేడ్‌ ప్రమోషన్‌ ఆర్గనైజేషన్‌(ఐటీపీఓ) చైర్మన్‌, ఎండీగా ఉన్న ప్రదీప్‌ సింగ్‌ ఖరోలాకు ఎన్‌టీఏ డైరెక్టర్‌ జనరల్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలోనే నీట్‌ లీక్‌ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగిస్తూ శనివారం రాత్రి కీలక నిర్ణయం తీసుకుంది. లీక్‌ మూలాలను తేల్చేందుకు సమగ్ర దర్యాప్తు కోసమే ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇలా ఉండగా, నీట్-యూజీ పరీక్షలో జరిగిన అవకతవకలపై దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) స్వాగతించింది. సమగ్ర విచారణ కోసం సీబీఐకి బదిలీ చేసినందుకు విద్యా మంత్రిత్వ శాఖకు కృతజ్ఞతలు తెలిపింది. పరీక్ష నిర్వహణ చుట్టూ వివాదాల నెలకొన్న వేళ సత్వరమే స్పందించినందుకు ప్రధాని నరేంద్ర మోదీతోపాటు కేంద్రమంత్రులు అమిత్షా, జేపీ నడ్డా, ధర్మేంద్ర ప్రధాన్లకు ఐఎంఏ కృతజ్ఞతలు తెలిపింది.

“నీట్-పీజీ విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సంస్కరణల అనివార్యమైన పరిణామమని మేం విశ్వసిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం వాగ్దానం చేసిన విధంగా బలమైన యంత్రాంగాన్ని మేం ఆశిస్తున్నాం” అని ఐఎంఏ తెలిపింది. మెడికల్, డెంటల్, ఇతర కోర్సుల్లో ప్రవేశాల కౌన్సెలింగ్ సకాలంలో ప్రారంభమయ్యేలా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవాలని ఐఎంఏ కోరింది.

కాగా, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెబ్‌సైట్తోపాటు ఎన్టీఏకు సంబంధించిన ఇతర వెబ్ పోర్టల్‌లు పూర్తి సురక్షితంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. వెబ్సైట్లు హ్యాక్ అయ్యాయని వస్తున్న ఇటీవల వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన చెప్పారు.