రైల్వే సేవలు జీఎస్టీ నుండి మినహాయింపు

ప్రయాణికులకు రైల్వేలు అందించే పలు సేవలను జీఎస్టీ నుంచి మినహాయించాలని శనివారం జరిగిన 53వ  జీఎస్టీ కౌన్సిల్ సమావేశం  తీర్మానించింది.రైల్వేలు అందించే ప్లాట్‌ఫారమ్ టిక్కెట్ల విక్రయం, రిటైరింగ్ గదుల సౌకర్యం, వెయిటింగ్ రూమ్‌లు, క్లోక్‌రూమ్ సేవలు, బ్యాటరీతో నడిచే కార్ల సేవలు వంటి సేవలను  జీఎస్టీ నుండి మినహాయించాలని సిఫార్సు చేసింది. ఇంకా, అంతర్-రైల్వే  సరఫరాలకు కూడా మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది.
 
విద్యా సంస్థల వెలుపలి విద్యార్థుల హాస్టళ్లకు కూడా జీఎస్టీ నుంచి మినహాయింపు ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశం అనంతరం తెలిపారు. ప్రతి వ్యక్తికి నెలకు రూ. 20,000 వరకు సరఫరా విలువ కలిగిన వసతి సేవలను మినహాయించాలని కౌన్సిల్ సిఫార్సు చేసింది. “ఈ సేవలు కనీసం 90 రోజుల పాటు నిరంతరాయంగా అందించబడతాయి…” అని ఆమె తెలిపారు.
 
చిన్న వ్యాపారులకు మేలు చేసేలా జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు తీసుకున్నదని నిర్మలా సీతారామన్ చెప్పారు. త్వరలో బడ్జెట్ పార్లమెంట్ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. జీఎస్టీపై ట్రిబునళ్లు, కోర్టుకు వెళ్లే ట్రాన్సాక్షన్ పరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు సమావేశం తర్వాత నిర్మలా సీతారామన్ మీడియాకు చెప్పారు.
 
అలాగే వ్యాపారులు జరిమానా చెల్లించడంలో ఆలస్యమైతే, దానిపైన వడ్డీ కూడా చెల్లించాల్సి ఉందని, దీన్ని ఎత్తేయాలని జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో సభ్యుల నుంచి ప్రతిపాదనలు వచ్చాయన్నారు.  ఇన్ పుట్ క్రెడిట్ టాక్స్ విషయంలో మార్పులు చేయాలని నిర్ణయించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.  ప్రత్యేకించి, ఇన్ పుట్ క్రెడిట్ టాక్స్ విషయంలో మోసాలు జరుగకుండా ఆధార్ అథంటికేషన్ తప్పనిసరి అమలు చేయాలని నిర్ణయించాం అని తెలిపారు. అన్ని రకాల కార్టన్ బాక్సులపై జీఎస్టీ 12 శాతానికి కుదించడం ద్వారా ఆపిల్, ఇతర పండ్ల వ్యాపారులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు.

స్ప్రింకర్లు, సోలార్ కుక్కర్లపై జీఎస్టీ 12 శాతానికి తగ్గించాలని కూడా జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది.  అన్ని పాల క్యాన్లపై ఏకరీతి జీఎస్టీ రేటు 12 శాతంగా సిఫార్సు చేసింది. అన్ని కార్టన్ బాక్సులపై ఏకరీతి జీఎస్‌టీ రేటు 12 శాతం ఉండాలని సిఫారసు చేసింది.  ఫైర్ వాటర్ స్ప్రింక్లర్‌లతో సహా అన్ని రకాల స్ప్రింక్లర్‌లకు 12 శాతం జీఎస్‌టీ వర్తిస్తుందని స్పష్టం చేసింది.

మరోవైపు, పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తేవాలని కేంద్రప్రభుత్వం భావిస్తోందని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఈ విషయంలో రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు. పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే విషయంలో రాష్ట్రాలు ఐక్యం కావాలని సూచించారు.  జీఎస్టీ చట్టంలోని సెక్షన్ 73 నిబంధన కింద విధించే జరిమానాలపై ప్రధానంగా చర్చించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. గతేడాది అక్టోబర్ తర్వాత జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరుగడం ఇదే తొలిసారి అని నిర్మలా సీతారామన్ చెప్పారు.

సార్వత్రిక ఎన్నికల వల్ల చాలా కాలం తర్వాత జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగిందని తెలిపారు. శనివారం చర్చించిన అంశాలపై పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తర్వాత మరోమారు జీఎస్టీ కౌన్సిల్ సమావేశమై ఈ రోజు చర్చించిన అంశాలపై తుది నిర్ణయం తీసుకుంటుందని నిర్మలా సీతారామన్ చెప్పారు.

మరోవైపు, రాష్ట్రాలు అభివృద్ధిని కొనసాగించడానికి పన్నుల్లో వాటా, జీఎస్టీ పరిహార బకాయిలను సమయానికి కేంద్రం చెల్లిస్తుందని ఆర్థిక మంత్రి  హామీ ఇచ్చారు. రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో ఆమె బడ్జెట్ ముందస్తు సమావేశం నిర్వహించారు. సూచించిన సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు 50 ఏళ్లు వడ్డీలేని రుణాలు అందించే పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.