ఎన్టీఏ చీఫ్ కు ఉద్వాసన… సీబీఐకి అప్పగింత

ఎన్టీఏ చీఫ్ కు ఉద్వాసన… సీబీఐకి అప్పగింత
* ఎన్టీఏ ప్రక్షాళనకు ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ  
ఎంబీబీఎస్ సహా యూజీ వైద్య విద్యా కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నీట్ యూజీ, ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్లకు జేఈఈ మెయిన్ నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ సింగ్‌ను కేంద్రం శనివారం రాత్రి తొలగించింది. చివరగా శనివారం రాత్రి నీట్‌ లీక్‌ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. లీక్‌ మూలాలను తేల్చేందుకు సమగ్ర దర్యాప్తు కోసమే సీబీఐకి అప్పగిస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
సీబీఐ దర్యాప్తు నిర్ణయానికి కొద్ది గంటల ముందు కేంద్రం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) డైరెక్టర్‌ జనరల్‌ సుబోధ్‌ కుమార్‌సింగ్‌పై వేటేసింది. ఆయన స్థానంలో ఇండియా ట్రేడ్‌ ప్రమోషన్‌ ఆర్గనైజేషన్‌ చైర్మన్‌ అయిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ప్రదీ్‌పసింగ్‌ కరోలాకు ఎన్‌టీఏను అదనపు బాధ్యతగా అప్పగించారు. 
నీట్ యూజీ 2024 నిర్వహణలో అవకతవకలు, నీట్ ప్రశ్నపత్రం లీకేజీ జరిగిందన్న ఆరోపణలతో విద్యార్థులు, విపక్షాలు దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాయి. 
 
రెండు ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణల నేపథ్యంలో రెండు నెలలుగా మీడియాలో విమర్శలు ఎదుర్కొంటున్న ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ గా సుబోధ్ కుమార్ సింగ్ మీడియాకు దూరంగా ఉండేవాడని, లో ప్రొఫైల్ లో కొనసాగేవాడని సమాచారం. సుబోధ్‌ కుమార్‌ సింగ్‌ ఎన్‌టీఏ డీజీ హోదాలో దాదాపు 1500 మంది విద్యార్థులకు గ్రేస్‌ మార్కులు ఇచ్చి నీట్‌-యూజీ పరీక్షపై వివాదానికి తెర తీశారు. 
 
మరోవంక,  నీట్‌-యూజీ, యూజీసీ-నెట్‌ ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలతో పరీక్షల వ్యవస్థపై అనుమానాలు పెరుగుతున్న వేళ కేంద్రం దిద్దుబాటు చర్యలకు దిగింది. పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచేందుకు, అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు తీసుకోవాల్సిన చర్యల కోసం ఒక ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని నియమించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. 
 
ఈ కమిటీకి ఇస్రో మాజీ చైర్మన్‌ డాక్టర్‌ కే రాధాకృష్ణన్‌ నేతృత్వం వహించనున్నారు. ఇందులో సభ్యులుగా ఎయిమ్స్‌ మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ బీజే రావు, ఐఐటీ మద్రాస్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగం ప్రొఫెసర్‌ రామమూర్తి, పీపుల్‌ స్ట్రాంగ్‌ సంస్థ సహ వ్యవస్థాపకుడు, కర్మయోగి భారత్‌ సంస్థ బోర్డు సభ్యుడు పంకజ్‌ బన్సల్‌, ఐఐటీ ఢిల్లీ విద్యార్థి వ్యవహారాల డీన్‌ ప్రొఫెసర్‌ ఆదిత్య మిట్టల్‌ను కేంద్ర విద్యా శాఖ నియమించింది.
 
ఈ కమిటీ రెండు నెలల్లో దర్యాప్తు నివేదికను అందజేస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.  పరీక్షలను సజావుగా, న్యాయబద్ధంగా నిర్వహించడం, యంత్రంగాన్ని మెరుగుపరచడం, డేటా సెక్యూరిటీ ప్రోటోకాల్‌ను మెరుగుపరచడం, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ పనితీరుపై సిఫారసులు చేయనున్నది. విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి గోవింద్‌ జైస్వాల్‌ ఈ కమిటీకి సభ్య కార్యదర్శిగా కొనసాగుతారు.
 
కాగా, నిపుణుల కమిటీ ఏర్పాటును యూజీసీ చైర్మన్‌ జగదీశ్‌ కుమార్‌ స్వాగతించారు. ఈ కమిటీ సిఫార్సు చేసే సంస్కరణల ద్వారా జాతీయ ప్రవేశ పరీక్షల వ్యవస్థ పటిష్ఠం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నీట్-పీజీ ఎంట్రెన్స్ పరీక్షను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. ఆదివారం ఈ పరీక్ష జరగాల్సి ఉండగా.. శనివారం రాత్రి ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 
 
ముందు జాగ్రత్త చర్యగా కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని పోటీ పరీక్షల సమగ్రతపై ఇటీవల ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా జూన్ 23న జరగాల్సిన నీట్-పీజీ ప్రవేశ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది.

గత మూడు రోజుల్లో వాయిదా లేదా రద్దు చేసిన మూడో పోటీ పరీక్షగా నీట్ పీజీ ఎంట్రెన్స్ ఎగ్జామ నిలిచింది. గురువారం  కేంద్ర విద్యా శాఖ అంతకుముందు జరిగిన యూజీసీ-నెట్ పరీక్షను రద్దు చేసింది. ఈ పరీక్ష పేపర్ డార్క్ నెట్లో లీకైనట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. దీంతో ఈ పరీక్షను రద్దు చేయాల్సి వచ్చింది.

ఇక శుక్రవారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.. సీఎస్ఐఆర్ యూజీసీ-నెట్ ను వాయిదా వేసింది. కొన్ని అనివార్య పరిస్థితులు, లాజిస్టిక్ సమస్యల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇందులో పేపర్ లీక్ ఏమీ లేదని, అయితే లాజిస్టిక్ సమస్యల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు.