జమ్మూ కాశ్మీర్ కు వెళ్లే అమర్ నాథ్ యాత్ర ‘ప్రథమ పూజ’ శనివారం జరిగింది. శ్రీనగర్ లోని రాజ్ భవన్ నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పూజా కార్యక్రమానికి హాజరయ్యారు. జూన్ 29 నుంచి బాబా బర్ఫానీ కి మొక్కులు చెల్లించడానికి భక్తులు అమర్ నాథ్ ను దర్శించుకోవచ్చు.
ఈ ఏడాది అమర్ నాథ్ యాత్ర జూన్ 29 నుంచి మొదలయి ఆగస్టు 19 వరకు సాగుతుంది. అమర్ నాథ్ గుహ మందిరం జమ్మూకశ్మీర్ లో ఉంది. పరమ శివుడిని కొలిచేందుకు ప్రతి ఏడాది వేలాది భక్తులు అమర్ నాథ్ కు వస్తుంటారు. గత ఏడాది 4.5 లక్షలకు పైగా భక్తులు అమర్ నాథ్ కు వచ్చారు. భక్తుల రక్షణ ఇక్కడ చాలా కీలకం అని భద్రతా అదికారులు తెలిపారు.
మరో వారం రోజుల్లో అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసి యాత్రికులకు మరింత మెరుగైన సౌకర్యాలను కల్పించడానికి అన్ని చర్యలను చేపట్టినట్లు జమ్మూ కశ్మీరు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శనివారం తెలిపారు.
జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై భద్రతా ఏర్పాట్లను సమీక్షించిన జమ్మూ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు ఆనంద్ జైన్ యాత్రను భగ్నం చేసేందుకు ఉగ్రవాదులు చేసే ప్రయత్నాలను భగ్నం చేయడానికి అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన పోలీసు అధికారులను హెచ్చరించారు. అమర్ నాథ్ యాత్ర ప్రశాంతంగా జరిగేందుకు ఏర్పాట్లన్ని చేశామని తెలిపారు.
అమర్‌నాథ్ యాత్ర ప్రారంభానికి సూచికగా శ్రీనగర్‌లోని రాజ్‌భవన్‌లో శనివారం ఉదయం జరిగిన ప్రథమ్ పూజలో పాల్గొన్న సిన్హా మాట్లాడుతూ జూన్ 29 నుంచి దేశవ్యాప్తంగా భక్తులకు అమర్‌నాథ్ మంచు లింగ దర్శనం ప్రారంభమవుతుందని తెలిపారు. యాత్రికుల కోసం శ్రీఅమర్‌నాథ్ క్షేత్ర బోర్డు, జమ్మూ కశ్మీరు పాలనా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని ఆయన తెలిపారు.
గడచిన రెండేళ్లలో యాత్రికులకు సౌకర్యాలు చాలా మెరుగుపడినట్లు ఆయన చెప్పారు. మంచు లింగం ఉండే గుహతో వెళే రహదారులను మెరుగు పరిచినట్లు ఆయన చెప్పారు. కొన్ని ఇరుకు మార్గాలను బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బిఆర్‌ఓ) ఈ ఏడాది వెడల్పు చేసినట్లు సిన్హా తెలిపారు. ఈసారి యాత్రికులు మరింత సులభంగా, సౌకర్యవంతంగా దర్శనం చేసుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.

More Stories
పశ్చిమ బెంగాల్లో 58 లక్షల ఓట్ల తొలగింపు
గాలి నాణ్యతపై సొంతంగానే మార్గదర్శకాలు
5 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతానికి ఎస్ఐఆర్ గడువు పొడిగింపు