జనరల్‌ కోచ్‌ల సంఖ్య రెట్టింపు

జనరల్‌ కోచ్‌ల సంఖ్య రెట్టింపు

రైల్వే ప్రయాణికులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ముఖ్యంగా సామాన్యులు ఎక్కువగా ప్రయాణించే అన్‌ రిజర్వ్‌డ్‌ బోగీలైన జనరల్‌ కోచ్‌ల సంఖ్యను పెంచాలని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో జనరల్‌ కంపార్టుమెంట్లను రెట్టింపు చేస్తామని, దీనివల్ల లక్షలాది మంది ప్రయాణికులకు ఉపయోగడుతుందని తెలిపింది. 

పలు రైళ్లలోని జనరల్‌ బోగీలు, స్లీపర్‌ క్లాస్‌ బోగీల్లో ప్రయాణికులు కిక్కిరిసి ప్రయాణిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్‌ అవుతున్నాయి. రిజర్వేషన్‌ ఉన్నా కూర్చోడానికి కూడా వీలు లేకుండా బోగీ మొత్తం అన్‌రిజర్వ్‌డ్‌ ప్రయాణికులతో నిండిపోయి ఉందని రిజర్వేషన్‌ చేసుకున్న పలువురు ప్రయాణికులు తరచుగా ఆరోపిస్తున్నారు.

దీనిపై రైల్వే శాఖకు పలు ఫిర్యాదు అందడంతో స్పందించిన రైల్వే బోర్డు అధికారులు సమావేశమై కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రైల్వే శాఖకు అవసరమైన కోచ్‌ల నిర్మాణంతో పాటు అదనంగా ఏడాదికి 2500 సామాన్య తరగతి కోచ్‌లను తయారు చేయించాలని నిర్ణయించింది.  దీని కారణంగా దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది 18 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుందని రైల్వే సీపీఆర్‌వో వినీత్‌ అభిషేక్‌ వెల్లడించారు. తాజా నిర్ణయం ప్రకారం ప్రస్తుతం ఉన్న రెండు జనరల్‌ కోచ్‌లను రెట్టింపు చేసి నాలుగుకు పెంచుతారు. అసలు జనరల్‌ కోచ్‌లే లేని రైళ్లకు రెండు జనరల్‌ కోచ్‌లను జత చేస్తారు. 

ప్రతి కోచ్‌లో 150 నుంచి 200 మంది ప్రయాణించేలా వీటిని డిజైన్‌ చేస్తారు. దీని ప్రకారం ప్రతిరోజూ 5 లక్షల మంది వీటిలో ప్రయాణించవచ్చు. అలాగే ఈ నిర్ణయంతో మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ప్రయాణికులను తీసుకువెళ్లే సంఖ్య కూడా పెరుగుతుంది. ప్రస్తుతం ఏటా తయారవుతున్న 1377 స్లీపర్‌ క్లాస్‌ కోచ్‌లతో పాటు 2500 జనరల్‌ కోచ్‌లు ఈ ఆర్థిక సంవత్సరంలోగానే సిద్ధమవుతాయని వినీత్‌ అభిషేక్‌ తెలిపారు. 

కోచ్‌ల తయారీ సామర్థ్యాన్ని ఏటేటా పెంచుతున్నామన్నారు. 2014-15లో 555 ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను తయారు చేయగా, 2023-24 నాటికి 7,151కు పెంచినట్టు చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో అమృత్‌ భారత్‌, వందే భారత్‌ కోచ్‌లు సహా 8,692 కోచ్‌లు తయారుచేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు చెప్పారు. సౌకర్యవంతమైన ప్రయాణానికి అవసరమైన అన్ని ప్రణాళికలను రైల్వే అమలు చేస్తున్నదని తెలిపారు.