బొగ్గు గనుల వేలంతో రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా లబ్ధి

బొగ్గు గనుల వేలంతో రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా లబ్ధి చేకూరుతుందని కేంద్ర గనుల మంత్రి జి. కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. పదో విడత బొగ్గు గనుల వేలం ప్రక్రియను  హైదరాబాద్ వేదికగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు సింగరేణి సీఎండీ సమక్షంలో ప్రారంభించారు.  సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు ఎటువంటి నష్టం కలగకుండా చూస్తామని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. సింగరేణిని మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొంటూ  సుప్రీంకోర్టు మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకొని వేలం చేపట్టినట్లు చెప్పారు.

ఈ గనుల వేలంపై భట్టి విక్రమార్క లేవనెత్తిన అంశాలపై ప్రధానితో మాట్లాడతానని కిషన్రెడ్డి తెలిపారు. ఆదాయం కోసం మాత్రమే బొగ్గు గనుల వేలం వేయడం కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. అదేవిధంగా బొగ్గు గనులు కావాలంటే అన్ని సంస్థలకు ఒకే విధానం ఉందన్న కిషన్రెడ్డి, సింగరేణిని అదుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామని భరోసా ఇచ్చారు.

సింగరేణికి సంబంధించి  కొన్ని సమస్యలున్నాయని, వాటిని తప్పకుండా పరిష్కరిస్తామని తెలిపారు. ఢిల్లీ వెళ్లాక దీనిపై అధ్యయనం చేస్తామని పేర్కొంటూ సింగరేణి విషయంలో బొగ్గుగనుల శాఖ అధికారులకు పూర్తి అవగాహన ఉందని తెలిపారు.  ఈ విషయాన్ని ఎవరూ రాజకీయం చేయకూడదని కోరారు. కాంగ్రెస్‌, బీజేపీ ఒకటేనని బీఆర్ఎస్,. బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని కాంగ్రెస్‌ నేతలు విమర్శలు చేయడం సరికాదని ఆక్షేపించారు. 

సింగరేణి కార్మికులు ఆందోళన చెందకూడదని కోరారు. వేలంపాట వల్ల రాష్ట్రాలకే ఆదాయం వస్తుంది తప్ప కేంద్రానికి కాదని కిషన్‌రెడ్డి తేల్చి చెప్పారు. ఒడిశా నైనీ కోల్‌ బ్లాక్‌లో సింగరేణికి లాభం చెందే విధంగా చేస్తామని, .త్వరలో ఒడిశా, తెలంగాణ ప్రభుత్వాలతో మాట్లాడుతామని హామీ ఇచ్చారు. కొత్త కోల్‌మైన్‌ యాక్షన్‌ సుప్రీంకోర్టు ఆదేశాలతోనే చేస్తున్నామని స్పష్టం చేశారు. సింగరేణి కార్మికులకు కేంద్రం అన్యాయం చేయదని భరోసా ఇచ్చారు.

తాజాగా జరుగుతున్న పదో వేలంలో మొత్తం 60 బొగ్గు బ్లాకులు ఉన్నాయి. అత్యధికంగా ఒడిశాకు చెందిన 16 బ్లాకులు, ఛత్తీ్‌సగఢ్‌కు చెందిన 15, జార్ఖండ్‌ – 6, బిహార్‌, పశ్చిమ బెంగాల్‌లకు చెందిన చెరో 3 బ్లాకులను వేలం వేస్తున్నారు. ఇక తెలంగాణ నుంచి చూస్తే ఒక శ్రావణపల్లి మాత్రమే జాబితాలో ఉంది. ఈ బ్లాకులో 11.99 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు గతంలో సింగరేణి నిర్వహించిన అన్వేషణలో తేలింది.

ఈ బ్లాకును దక్కించుకోవడానికి సింగరేణి కూడా తొలిసారి వేలంలో పాల్గొనింది. ఈ బ్లాక్ ను సింగరేణికే ఇవ్వాలని భట్టి కోరిన నేపథ్యంలో ఈ బ్లాక్ ఎవరికి దక్కబోతుందనేది ఉత్కంఠగా మారింది. ఈ బ్లాక్ ఎలాగైనా దక్కించుకోవాలని సింగరేణి యాజమాన్యం గట్టిగా భావిస్తోంది. సింగరేణికి కొత్త గనులు కేటాయించాలని భట్టి కోరారు.

గనులు కేటాయించకపోతే భవిష్యత్తులో సింగరేణి మూతపడే పరిస్థితి తలెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.  సింగరేణికి వేలంలో రిజర్వేషన్‌ కల్పించాలని కోరారు. సింగరేణికి కేంద్ర ప్రభుత్వం సహకారం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు.  సింగరేణి సంస్థ కొంగు బంగారం వంటిదన్న భట్టి 130 ఏళ్ల అనుభవం ఉన్న సింగరేణి సంస్థకు కొత్త బ్లాక్‌లు కేటాయించాల్సిన అవసరం ఉందని చెప్పారు. వేలం పెట్టిన శ్రావణపల్లి గనిని సింగరేణికే ఇచ్చే విధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు. సింగరేణి వేలంలో రిజర్వేషన్లను కల్పించే విధంగా చొరవ చూపాలని భట్టి కోరారు.