బాంగ్లాదేశ్ తో సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం దిశగా చర్చలు

బాంగ్లాదేశ్ తో సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం దిశగా చర్చలు
సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం ఒప్పందం దిశగా చర్చలు ప్రారంభించాలని భారత్- బాంగ్లాదేశ్ లు నిర్ణయించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్ హసీనాతో ద్వైపాక్షిక చర్చల అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అన్ని రంగాల్లో సంబంధాలను మరింత విస్తరించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని నిశ్చయించినట్లు వెల్లడించారు. 

భారత్‌కు బంగ్లాదేశ్ అతిపెద్ద అభివృద్ధి భాగస్వామి అని పేర్కొన్న ప్రధాని, ఆ దేశంతో సంబంధాలకు అధిక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.  సైనిక సహకారం, ఆయుధాల ఉత్పత్తి, భద్రతా దళాల ఆధునికీకరణపై విస్తృతంగా చర్చించినట్లు ప్రధాని మోదీ చెప్పారు. 

భారత్‌. తమకు నమ్మకమైన మిత్రదేశమని బంగ్లా ప్రధాని షేక్ హసీనా తెలిపారు. 1971లో స్వాతంత్ర్య సమరంలో భారత్‌తో ఏర్పడిన సంబంధాలకు తాము విలువనిస్తామని పేర్కొన్నారు. రైల్వేల అనుసంధానం, డిజిటల్, మారిటైమ్ రంగాల్లో సహకారం మరింత విస్తరించే దిశగా భారత్- బంగ్లాదేశ్‌ ఒప్పందాలు చేసుకున్నాయి. హరిత భాగస్వామంపైనా ఒప్పందాలు చేసుకున్నాయి.

“గత పదేళ్లలో మేం 1965కు ముందున్న సంబంధాలను పునరుద్ధరించాం. ఇప్పుడు డిజిటల్‌, ఇంధన రంగాల్లో సంబంధాలకు ప్రాధాన్యం ఇస్తాం. దీనివల్ల రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు వేగం పుంజుకుంటాయి. ఇరుదేశాల మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై చర్చలు జరపాలని ఓ అంగీకారానికి వచ్చాం.” అని ప్రధాని మోదీ తెలిపారు. 
 
బంగ్లాదేశ్‌లోని సిరాజ్‌గంజ్‌లో కంటెయినర్‌ డిపో నిర్మాణానికి భారత్‌ మద్దతు అందిస్తుందని ఆయన చెప్పారు. 54 నదులు ఇరుదేశాలను కలుపుతాయని, వరద నిర్వహణ, ముందస్తు హెచ్చరికలు, తాగునీటి ప్రాజెక్టులపై సహకరించుకుంటూ వచ్చామని వివరించారు.  “మేం 1996 గంగానది ఒప్పందం కోసం సాంకేతిక అంశాలపై చర్చలు ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నాం. బంగ్లాదేశ్‌లోని తీస్తానది సంరక్షణ, నిర్వహణ కోసం వెంటనే సాంకేతిక బృందం బంగ్లాదేశ్‌కు వెళ్తుంది” అని మోదీ వెల్లడించారు.

2019 నుంచి భారత్‌- బంగ్లా ప్రధానులు ఇప్పటికే పదిసార్లు కలుసుకున్నారని, ఈ చర్చలు ద్వైపాక్షిక సంబంధాల్లో అపూర్వమైన మార్పులకు దారి చూపాయని విదేశాంగ శాఖ ప్రతినిధి అంతకు ముందు రణధీర్ జైస్వాల్ పోస్ట్ చేశారు. వాణిజ్యం, కనెక్టివిటీ, ఇంధన రంగాలతో సహా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై మోదీ-హసీనా కీలక చర్చలు జరిపారని రణధీర్‌ వివరించారు. 

షేక్ హసీనా, ప్రధాని మోదీ చర్చలు భారత్‌-బంగ్లా సంబంధాలకు కొత్త ఊపు తెస్తాయని తెలిపారు. తన పర్యటన రెండు దేశాల మధ్య సన్నిహిత, స్థిరమైన సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని హసీనా చెప్పారు.

భారత పర్యటనకు వచ్చిన బంగ్లా ప్రధాని షేక్‌ హసీనాకు ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో శనివారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లో లాంఛనప్రాయ స్వాగతం లభించింది. విదేశాంగ మంత్రి జైశంకర్, కేంద్ర మంత్రి జేపీ నడ్డా, జితేంద్ర సింగ్, కీర్తి వర్ధన్ సింగ్ బంగ్లా ప్రధానికి స్వాగతం పలికారు.
 
 త్రివిధ దళాల నుంచి బంగ్లా ప్రధాని షేక్​ హసీనా గౌరవ వందనం స్వీకరించారు. రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి షేక్‌ హసీనా నివాళులర్పించారు. జూన్ 9న ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రి మండలి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ఏడుగురు విదేశీ అగ్ర నేతల్లో హసీనా కూడా ఉన్నారు. మరో పక్షం రోజుల లోపుగానే ఆమె భారత్ పర్యటనకు రావడం గమనార్హం.