ఈవీఎం వెరిఫికేషన్లకు 8 లోక్‌సభ స్థానాల అభ్యర్థుల దరఖాస్తు

ఈవీఎం వెరిఫికేషన్లకు 8 లోక్‌సభ స్థానాల అభ్యర్థుల దరఖాస్తు
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల (ఈవీఎం) వెరిఫికేషన్‌ కోసం ఎన్నికల కమిషన్‌ కు దరఖాస్తులు అందాయి. జూన్‌ 4 నాటి ఫలితాల్లో 8 లోక్‌సభ స్థానాల్లో ఓటమి పాలైన అభ్యర్థులు ఈ మేరకు ఈసీని ఆశ్రయించారు. మైక్రో కంట్రోలర్ చిప్‌ ట్యాంపరింగ్, ఈవీఎంలలో అవకతవకలపై తనిఖీ కోసం కాంగ్రెస్, బీజేపీతో సహా పలు పార్టీల అభ్యర్థులు దరఖాస్తు చేశారు.

మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ స్థానంలో పోటీ చేసి ఓడిన బీజేపీ అభ్యర్థి సుజయ్ విఖే పాటిల్ 40 పోలింగ్ కేంద్రాల ఈవీఎంలను వెరిఫై చేయాలని కోరారు. ఏపీకి చెందిన వైఎస్సార్‌సీపీ, తమిళనాడుకు చెందిన డీఎండీకే అభ్యర్థి కూడా ఈవీఎంల తనిఖీ కోసం దరఖాస్తు చేశారు. ఇప్పటివరకు ఆరు రాష్ట్రాల్లోని ఎనిమిది పార్లమెంట్ స్థానాల నుంచి దరఖాస్తులు అందినట్లు ఈసీ తెలిపింది. 

వెరిఫికేషన్ కోరిన మొత్తం పోలింగ్ స్టేషన్ల సంఖ్య 92 అని పేర్కొంది. అలాగే అసెంబ్లీ ఫలితాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, ఒడిశాకు చెందిన వైఎస్సార్‌సీపీ, బీజేడీ అభ్యర్థులు ఈవీఎం చెకింగ్‌ కోసం దరఖాస్తు చేసినట్లు ఈసీ వెల్లడించింది. మరోవైపు ఈవీఎంలో అవకతవకలు జరుతున్నాయన్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్‌ను ఏప్రిల్ 26న తిరస్కరించింది.

అయితే ఫలితాల్లో రెండో, మూడో స్థానంలో నిలిచిన బాధిత అభ్యర్థులకు ఊరట ఇచ్చింది.  ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదు శాతం ఈవీఎంల మైక్రో కంట్రోలర్ చిప్‌ తనిఖీ చేసేందుకు లిఖితపూర్వకంగా ఈసీకి దరఖాస్తు చేసేందుకు అనుమతించింది. అలాగే అందుకు అవసరమయ్యే ఖర్చులను ఈసీకి చెల్లించాలని పేర్కొంది.

కాగా, జూన్ 1న ఈసీ జారీ చేసిన విధివిధానాల ప్రకారం ఒక బ్యాలెట్ యూనిట్, ఒక కంట్రోల్ యూనిట్, ఒక వీవీపీఏటీ మెషీన్ కలిగిన ఒక్కో ఈవీఎం సెట్‌ తనిఖీ కోసం అభ్యర్థులు రూ.47,200 (రూ.40,000 తయారీ, జీఎస్టీతో కలిపి) చెల్లించాలి.  ఈవీఎం వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులు 2025 మార్చి 31 వరకు రుసుం చెల్లించేందుకు అవకాశం ఇచ్చింది. అలాగే సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో పారదర్శకత దృష్ట్యా ఈవీఎంల నిర్వహణ, ఇతర ఆర్థిక వ్యయాలను పరిగణనలోకి తీసుకోలేదని ఈసీ పేర్కొంది.