భద్రాద్రి థర్మల్ ప్లాంటు తెలంగాణ డిస్కంలకు భారమే 

* విచారణ కమిషన్ కు జెన్కో నివేదిక

భద్రాద్రి థర్మల్ ప్లాంటు నిర్మాణంపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ బొగ్గు వినియోగం, విద్యుదుత్పత్తి వ్యయంపై సమగ్ర వివరాలను సేకరించింది. ఈ ప్లాంటులో విద్యుదుత్పత్తి వ్యయం భారీగా పెరిగిందని తెలిపింది. గత కొన్ని రోజులుగా భద్రాద్రి థర్మల్ ప్లాంట్పై కమిషన్ విచారణను వేగవంతం చేసింది.

భద్రాద్రి ప్లాంటులో పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి చేయలేకపోవడానికి కారణం నాణ్యత లేని బొగ్గును సరఫరా చేయడమేనని తెలంగాణ జెన్కో ఇటీవల సింగరేణి సంస్థకు లేఖ రాసింది. ఈ ప్లాంటు పూర్తి సామర్థ్యం 1080 మెగావాట్లలో కనీసం 85 శాతం ఉత్పత్తి జరిగితే సగటు వ్యయం తగ్గి, రాష్ట్రానికి నిరంతర విద్యుత్ సరఫరా సాధ్యమవుతుందని తెలిపారు. 

అయితే బొగ్గు నాణ్యత లేనందున ఉత్పత్తి 70 శాతం వరకు మాత్రమే ఉంటుందని తెలిపింది. దీంతో నిర్వహణ ఖర్చులు భారీగా పెరుగుతున్నాయని, తరచూ బాయిలర్ ట్యూబుల లీకేజీ, ఇతర సాంకేతిక సమస్యలతో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరగడం లేదని చెప్పింది. 

సుదూర ప్రాంతాల నుంచి నాణ్యమైన బొగ్గును తెప్పించడానికి ఈ ప్లాంటు వరకు రైలు మార్గం కూడా ఇంకా పూర్తి కాలేదు. ఒకవేళ లారీల్లో తెప్పించాలంటే రవాణా ఛార్జీలతో ఖర్చు ఇంకా పెరిగిపోతుంది. నాణ్యమైన బొగ్గు అనేది రాకపోతే రాష్ట్ర డిస్కంలు ఇంకా మరింత ఆర్థిక భారాన్ని మోయాల్సి వచ్చే అవకాశం ఉంది.

జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి కమిషన్కు జెన్కో అందించిన వివరాలు

  • దేశంలోని పలు థర్మల్ విద్యుత్ కేంద్రాలతో పోలిస్తే భద్రాద్రిలో బొగ్గు వినియోగం, కరెంటు ఉత్పత్తి వ్యయం అధికంగా ఉంది.
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భద్రాద్రి ప్లాంటులో ఒక యూనిట్ విద్యుత్ ఉత్పత్తికి సగటున రూ.6.03 ఖర్చు అవుతుంది. కానీ భూపాలపల్లిలోని కాకతీయ థర్మల్ ప్లాంటులో సగటు ఉత్పత్తి వ్యయం రూ.4.89 మాత్రమే.
  • భూపాలపల్లిలో 500,600 మెగావాట్ల చొప్పున రెండు ప్లాంట్లు ఉన్నాయి. వీటిలో గతేడాది 822.44 కోట్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తికి 48.14 లక్షల టన్నుల బొగ్గును మండించారు. కానీ భద్రాద్రి ప్లాంటు సామర్థ్యం దాదాపు దానికి సమానంగా 1080 మెగావాట్ల. అయినా 695.39 కోట్ల యూనిట్ల కరెంటు ఉత్పత్తికే 52.30 లక్షల టన్నుల బొగ్గు వినియోగించారు.
  • కాకతీయ ప్లాంటు కన్నా 20 మెగావాట్లే తక్కువ సామర్థ్యం ఉన్నా భద్రాద్రిలో విద్యుదుత్పత్తి మాత్రం రూ.127 కోట్ల యూనిట్లు తగ్గగా, బొగ్గు మాత్రం 4.16లక్షల టన్నులు అదనంగా వినియోగించారు. భద్రాద్రి ప్లాంటులో ఒక యూనిట్ విద్యుదుత్పత్తికి సగటున 750 గ్రాముల బొగ్గును మండించాలి. కానీ కాకతీయ ప్లాంటులో 590 గ్రాములే సరిపోతుంది.
  • తెలంగాణలోని అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో మండించే మొత్తం బొగ్గు లెక్కను తీసుకున్నా సగటున 640 గ్రాముల బొగ్గును మం
  • డిస్తుంటే భద్రాద్రిలో అంతకన్నా 110 గ్రాములు ఎక్కువగా వినియోగించాల్సి వస్తోంది. దీని వల్లే అక్కడ ఉత్పత్తి వ్యయం యూనిట్కు రూ.6.03కి చేరింది. ఇంతకన్నా తక్కువ ధరకే భారత ఇంధన ఎక్స్ఛేంజి(ఐఈఎక్స్)లో కరెంటు లభిస్తోంది.
  • భద్రాద్రి ప్లాంటులో విద్యుత్ ఉత్పత్తి వ్యయం అధికంగా ఉండటం వల్ల దాన్ని కొంటున్న తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలపై ఆర్థిక భారం భారీగా పడుతుంది.