మ‌రో ప్ర‌పంచ యుద్ధానికి దారి తీసే అవ‌కాశాలు

మ‌రో ప్ర‌పంచ యుద్ధానికి దారి తీసే అవ‌కాశాలు
మరో సంక్షోభం దిశ‌గా ప్ర‌పంచ వెళ్తోంద‌ని చెబుతూ ఇజ్రాయిల్‌, హిజ్‌బుల్లా మ‌ధ్య ముదురుతున్న ఘ‌ర్ష‌ణ‌.. మ‌రో ప్ర‌పంచ యుద్ధానికి దారి తీసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు  ఐక్య‌రాజ్య‌స‌మితి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆంటోనియో గుటెర్రెస్ హెచ్చ‌రించారు. కొన్ని రోజుల క్రితం లెబ‌నాన్‌పై ఇజ్రాయిల్ దాడి చేసిన ఘ‌ట‌న‌లో హిజ్‌బుల్లా సీనియ‌ర్ క‌మాండ‌ర్ హ‌జ్ సామి త‌లేబ్ అబ్దుల్లా హ‌త‌మ‌య్యాడు. 
 
ఈ నేప‌థ్యంలో షియా మిలిట‌రీ గ్రూపున‌కు చెందిన అధినేత హ‌స‌న్ న‌స్రల్లా ఓ హెచ్చరిక చేసాడు. పశ్చిమ జెరుస‌లామ్‌లో పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగ‌నున్న‌ట్లు నస్ర‌ల్లా హెచ్చరించిన సంద‌ర్భంగా యూఎన్ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ స్పందించారు.  ఓ మొండి నిర్ణ‌యం, ఓ త‌ప్పుడు అంచ‌నా.. మ‌రో భారీ విప‌త్తును సృష్టిస్తుంద‌ని ఆందోళన వ్యక్తం చేశారు. 
 
అది స‌రిహ‌ద్దుల్ని దాటేస్తుంద‌ని, ఊహించ‌ని రీతికి వెళ్తుంద‌ని యూఎన్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆంటోనియో గుటెర్ర‌స్ తెలిపారు. లెబ‌నాన్‌ను మ‌రో గాజాగా చూడాల‌న్న కాంక్ష ప్ర‌పంచానికి లేద‌ని స్పష్టం చేశారు. రెండు దేశాలు శాంతి ప్ర‌క్రియ చేప‌ట్టాల‌ని ఆయ‌న ఇరు వ‌ర్గాల‌ను కోరారు.  లెబ‌నాన్‌, ఇజ్రాయిల్ మ‌ధ్య జ‌రుగుతున్న ఘ‌ర్ష‌ణ‌కు మిలిట‌రీ ప‌రిష్కారం కుద‌ర‌ద‌ని స్పష్టం చేశారు. ఇటీవ‌ల ఇజ్రాయిల్, హిజ్‌బుల్లా .. అనేక సార్లు రాకెట్ దాడుల‌కు పాల్ప‌డ్డాయి. దీని వ‌ల్ల 53 వేల మంది ఇజ్రాయిలీలు, ల‌క్ష‌ల మంది లెబ‌నీస్‌లు ఇండ్లు విడిచి వెళ్లార‌ని తెలిపారు.