మోసపూరిత వీసా దరఖాస్తులను గుర్తించడంతో పాటు జాతీయ భద్రతను పెంపొందించే లక్ష్యంతో కొత్త వీసా నిబంధనలను అమెరికా రూపొందించింది. హెచ్ -1 బీ, ఎల్-1 వీసాల కోసం రూపొందించిన ఈ కొత్త నిబంధనలను జులై 8వ తేదీన యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్ సిఐఎస్) ప్రకటించనుంది.
కొత్త వీసా విధానం వల్ల ఎంప్లాయర్స్ పై, నిపుణులపై, ముఖ్యంగా భారతీయులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. కొత్త ప్రతిపాదిత నిబంధనల ప్రకారం, అన్ని హెచ్ -1 బీ వీసా పొడిగింపు అభ్యర్థనలకు 4,000 డాలర్ల రుసుము చెల్లించాల్సి ఉంటుందని యుఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (సిహెచ్ఎస్) సూచించింది.
‘‘ఈ ప్రతిపాదిత మార్పులు యూఎస్ ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు ఉపాధి ఆధారిత వీసా కార్యక్రమాల సమగ్రతను నిర్ధారించడం, జాతీయ భద్రతను కాపాడటం లక్ష్యంగా పెట్టుకున్నాయి’’ అని డిహెచ్ఎస్ పేర్కొంది. ఈ కొత్త నిబంధనలపై కొన్ని రోజుల పాటు ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చు.
ఆ తరువాత, తుది నిర్ణయం వెలువడిన తరువాతే కొత్త చార్జీలను అమలు చేస్తారు. భారతీయ ఐటీ కంపెనీలు తమ సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ నిపుణులను అమెరికాలో హెచ్ -1బీ వీసా ద్వారానే నియమించుకుంటాయి. హెచ్-1బీ వీసా గ్రహీతల్లో చైనా, ఇండియా వారే ఎక్కువగా ఉంటారు. ఎల్-1 వీసా పొడిగింపు దరఖాస్తు ధరలో కూడా మార్పులు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
ఈ వీసా ద్వారా కంపెనీలు విదేశీ కార్యాలయాల నుంచి మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్ లను నియమించుకుని అమెరికాకు తీసుకురావచ్చు. ప్రతిపాదిత నియమం ప్రకారం ఎల్-1 వీసా పొడిగించడానికి 4,500 డాలర్ల రుసుమును తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. హెచ్-1బి వీసా దరఖాస్తుదారులకు యజమాని స్పాన్సర్షిప్ అలవెన్స్ ఇచ్చిన తర్వాత యూఎస్సీఐఎస్ రెసిడెన్సీ, వర్క్ పర్మిట్ ఇస్తుంది. ఈ పర్మిట్ ఉన్నత విద్య పూర్తయిన తర్వాత మొదటి మూడేళ్ల కాలానికి చెల్లుబాటు అవుతుంది.
2015లో ప్రవేశపెట్టిన 9/11 రెస్పాన్స్ అండ్ బయోమెట్రిక్ ఎంట్రీ-ఎగ్జిట్ ఫీజు మొదట దరఖాస్తు చేసిన వీసా పిటిషన్లకు, యజమానుల మార్పులకు మాత్రమే వర్తిస్తుంది. కాగా, తుది నిర్ణయం వెలువడే వరకు ఎల్-1, హెచ్-1బి వీసా పొడిగింపులకు కొత్తగా ప్రతిపాదించిన ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ధృవీకరించింది.

More Stories
సరిహద్దులో కొత్త వైమానిక రక్షణ స్థావరాన్ని నిర్మిస్తున్న చైనా
అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై భారత్ తొందర పడదు!
ఆసియాన్ సదస్సులో వర్చువల్ గా మోదీ