
యూజీసీ- నీట్, 2024 పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగినట్లు ఆరోపిస్తూ పలు హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్ల విచారణలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. నీట్ కౌన్సెలింగ్ ప్రక్రియను ఆపేది లేదని పునరుద్ఘాటించింది. ఈ మేరకు అన్ని పిటీషన్లు సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ గతంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) దాఖలు చేసిన పిటిషన్ను అత్యున్నత ధర్మాసనం గురువారం విచారించింది.
నీట్ యూజీ 2024 పరీక్ష రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్పై సమాధానం చెప్పాలని కేంద్రం, ఎన్‌టీఏకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. నీట్ పరీక్షలో అవకతవకలపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని ఆదేశించింది. దేశంలోని పలు హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న పిటిషన్లను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ ఎన్ టీఏ దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్లను విచారణను జులై 8కి వాయిదా వేసింది.
తొలుత బీహార్‌లో నీట్-2024 ప్రశ్నపత్రం లీకైనట్లు వచ్చిన వార్తలను కేంద్రం, నీట్ పరీక్ష నిర్వాహక సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తోసిపుచ్చాయి. కానీ పరీక్ష తేదీకి ముందు రోజే నీట్ పరీక్షా పత్రం తమ చేతికి వచ్చిందని ఇదే కేసులో బీహార్‌లో అరెస్టయిన విద్యార్థులు పోలీసుల విచారణలో అంగీకరించారు.
నీట్-2024 లీకేజీ ఆరోపణలపై దర్యాప్తు కోసం బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకూ సిట్ అధికారులు 14 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ఒక జూనియర్ ఇంజినీర్, ముగ్గురు నీట్ అభ్యర్థులు ఉన్నారు. ఈ నలుగురిలో ఓ నీట్ అభ్యర్థి.. జూనియర్ ఇంజినీర్‌కు మేనల్లుడని తెలుస్తోంది.
సదరు నీట్ పరీక్షకు హాజరైన విద్యార్థి పోలీసుల విచారణలో స్పందిస్తూ ‘రాజస్థాన్ లోని కోటాలో నేను నీట్ కోసం ప్రిపేర్ అవుతున్నా. నాకు మా మామయ్య ఫోన్ చేసి, నీట్ పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేశా.. ఇంటికి రమ్మన్నారు. గత నెల ఐదో తేదీన నీట్ పరీక్ష జరగడానికి ఒక రోజు ముందు అంటే మే నాలుగో తేదీ రాత్రి నా మిత్రులతో కలిసి నా మామయ్య ఇంటికి వెళ్లా.. అక్కడ నాకు నీట్ ప్రశ్నపత్రం, ఆన్సర్ షీట్ ఇచ్చారు. ఆ రాత్రంతా వాటిని కంఠస్థం చేశాం. ఐదో తేదీన పరీక్షా కేంద్రంలో మాకు ఇచ్చిన ప్రశ్నపత్రం.. ముందు రోజు మా మామయ్య ఇచ్చిన పేపర్ ఒక్కటే అని తేలింది’ అని చెప్పారు.
బీహార్‌లో నీట్ పరీక్షా పత్రం లీకేజీ కోసం సంబంధిత ముఠా రూ.32 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తున్నది. అలా లీకైన ప్రశ్నపత్రం అందుకున్న విద్యార్థుల్లో ఒకరికి 720 మార్కులకు 185, మరొకరికి 300, మరో ఇద్దరికి 581, 483 మార్కులు వచ్చాయని తెలుస్తున్నది.
కాగా, నీట్ పరీక్షలలో చెదురుమదురు అక్రమాల ఘటనల ప్రభావం లక్షలాది మంది విద్యార్థులపై పడరాదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. కొన్ని నిర్ణీత ప్రాంతాల్లోనే తప్పిదాలు లేదా అక్రమాలు జరిగి ఉంటాయని, వీటిని ప్రాతిపదికగా చేసుకుని మొత్తం పరీక్షకు ఎసరు పెట్టడం భావ్యం కాదని, కుదరదని ఆయన తెలిపారు. పరోక్షంగా ఆయన పరీక్ష మొత్తం రద్దును తోసిపుచ్చారు.
పరీక్షల నిర్వహణ సంస్థ ఎన్‌టిఎ పనితీరుపై ఉన్నత స్థాయి కమిటీ ఆరా తీస్తుందని చెబుతూ ఈ ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు గురించి త్వరలోనే ప్రకటన వెలువరిస్తామని చెప్పారు. టెస్టింగ్ ఏజెన్సీ పనితీరు సమీక్ష, నిర్వహణ మెరుగుదలకు ఈ కమిటీ రంగంలోకి దిగుతుందని మంత్రి తెలిపారు.
లీకులు, మోసాలు లేకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం పరీక్షలు నిర్వహించదని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. యూజీసీ-నెట్ పరీక్షను రద్దు చేసిన నేపథ్యంలో మోదీ ప్రభుత్వాన్ని పేపర్ లీక్ ప్రభుత్వంగా అభివర్ణించింది. ఈ పేపర్ లీకులకు కేంద్ర విద్యాశాఖ మంత్రి బాధ్యత వహిస్తారా? అని ప్రశ్నించింది. మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్లో జరిగిన అవకతవకలపై ప్రధానమంత్రి ‘నీట్ పరీక్షా పే చర్చ’ ఎప్పుడు నిర్వహిస్తారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు.
More Stories
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
సుంకాల యుద్ధం మధ్య స్వదేశీ, స్వావలంబనలకై భగవత్ పిలుపు