యోగా సాధనతో సకారాత్మక ఆలోచనలు‌

* దేశవ్యాప్తంగా ఘనంగా యోగా దినోత్సవం
ప్రపంచ యోగా గురుగా భారత్‌ మారిందని ప్రధాని నరేంద్ర మోదీ  తెలిపారు.  యోగా ప్రాముఖ్యత రోజురోజుకు పెరుగుతున్నదని చెప్పారు. యోగా సాధన వల్ల సకారాత్మక ఆలోచనలు వస్తాయని తెలిపారు. యోగా, ధ్యానంతో మన ఏకాగ్రత పెరుగుతుందని పేర్కొన్నారు. శ్రీనగర్‌లోని దాల్‌ సరస్సు ఒడ్డున ఉన్న షేర్‌-ఏ-కశ్మీర్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌ వద్ద జరిగిన అంతర్జాతీయ యోగా దశాబ్ది వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. 
 
దాల్ సరస్సు ఒడ్డున మోదీ 7000 మందితో యోగా చేయవలసి ఉండగా వర్షం కారణంగా కార్యక్రమానికి అంతరాయం కలిగింది. కార్యక్రమాన్ని ఇండోర్ స్టేడియంకు మార్చారు. ప్రజలతో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీనగర్‌లో ఒక శక్తి ఉందని, యోగా ద్వారా దానిని మరింత పెంచుకోవచ్చని తెలిపారు. గత పదేండ్లుగా ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం జరుపుకుంటున్నామని చెప్పారు.

2014లో తొలిసారి తాను అంతర్జాతీయ యోగా దినోత్సవం గురించి ఐక్యరాజ్యసమితిలో ప్రతిపాదించానని గుర్తు చేశారు. భారతదేశ ప్రతిపాదనకు 177 దేశాలు మద్దతిచ్చాయని చెప్పారు. ఇదొక రికార్డు అని తెలిపారు. అప్పటి నుంచి యోగా దినోత్సవం సరికొత్త రికార్డులు సృష్టిస్తూనే ఉందన్నారు. విదేశాల్లో యోగా చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నదని వెల్లడించారు.

యోగా నేర్పేందుకు వందల సంఖ్యలో సంస్థలు వెలిశాయని పేర్కొంటూ  జర్మనీలో ప్రస్తుతం కోటిన్నరమంది నిత్యం యోగా చేస్తున్నారని తెలిపారు. యోగా నేర్పే మహిళకు పద్మశ్రీ పురస్కారం కూడా దక్కిందని తెలిపారు.  మన దేశంలోని అనేక వర్సిటీలు యోగా కోర్సులు ప్రారంభించాయని చెప్పారు. యోగా.. ఇవాళ కోట్లమందికి దైనందిన కార్యక్రమైంది. 

యోగా ప్రాముఖ్యతను అనేక దేశాల నేతలు తనను అడిగారని వెల్లడించారు. యోగా వల్ల శారీరకంగా, మానసికంగా మార్పులు వస్తాయని చెబుతూ నేడు పదో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని కోరుతున్నానని చెప్పారు. యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచం నలుమూలలా యోగా చేస్తున్న అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

పదో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా యోగా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, ముఖ్యమంత్రులు యోగా కార్యక్రమాల్లో పాల్గొని యోగాసనాలు వేశారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో యోగాగురు రామ్‌దేవ్‌ బాబా, ఆచార్య బాలకృష్ణతో కలిసి యోగాసనాలు వేశారు. 

ఆ కార్యక్రమానికి చిన్నారులతో పాటు పెద్దలు పెద్ద ఎత్తున తరలి వచ్చి యోగా చేశారు. డిల్లీలో కేంద్రమంత్రులు బీఎల్‌ వర్మ, హెచ్‌డీ కుమారస్వామి, కిరణ్‌ రిజిజు, రాజ్‌నాథ్‌సింగ్‌, జేపీ నడ్డా తదితరులు 10వ అంతర్జాతీయ యోగాదినోత్సవాన్ని యోగాసనాలు వేసి జరుపుకొన్నారు.

డిల్లీలోని కరియప్ప పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఆర్మీచీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది సైనిక సిబ్బందితో కలిసి యోగా చేశారు. ఇండియన్‌ నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ దినేష్‌ కె త్రిపాఠితో పాటు పలువురు నావికాదళ అధికారులు యోగాసనాలు వేశారు. సముద్రంలో ఐఎన్ఎస్ విక్రమాదిత్య యుద్ధనౌకపై నావికాదళ కుటుంబీకులతో పాటు పలువురు ఔత్సాహికులు వేసిన యోగాసనాలు ఆకట్టుకున్నాయి.

ఎప్పటిలాగే ఈసారి యోగాదినోత్సవాన్ని సైనికులు ఘనంగా నిర్వహించారు. నార్తన్‌ ఫ్రాంటియర్‌ మంచుకొండలు, ఈస్టర్న్‌ లద్దాఖ్‌ వంటి ప్రతికూల ప్రాంతాల్లో సైనికులు చేసిన యోగాను సైనిక వర్గాలు పోస్టు చేశాయి. లేహ్‌లోని వాంగ్‌చుక్‌ స్టేడియంలో సైనిక సిబ్బంది సామూహిక యోగాసనాలు వేశారు.

ఆ దృశ్యాల్లో ప్రకృతి అత్యంత అందంగా, ప్రశాంతంగా దర్శనమిచ్చింది. ఆర్ ఎస్ పొరా సెక్టార్‌లో బీఎస్‌ఎఫ్‌ బలగాలు యోగా చేయగా, ప్యాంగ్‌సొంగ్‌ లేక్‌ ఒడ్డున స్థానిక పాఠశాల చిన్నారులు వేసిన యోగాసనాలు ఔరా అనిపించాయి. ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నారు. న్యూయార్క్‌లోని టైం స్క్వేర్‌ వద్ద ప్రవాస భారతీయులతో పాటు అమెరికన్లు యోగా డే జరుపుకొన్నారు. వందల సంఖ్యలో తరలివచ్చి ప్రాణాయామాలతో పాటు యోగాసనాలు వేశారు.