పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వ నిధులపై పవన్ ప్రశ్నల వర్షం

విజయవాడ క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్‌, గ్రామీణభివృద్ధి శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే తన శాఖలలో నెలకొన్న పరిస్థితులపై ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరుసగా సమీక్షలు నిర్వహించారు. సుమారు 10 గంటల సేపు జరిపిన సమీక్షలతో ఆయా శాఖలలో నెలకొన్న పరిస్థితులపై, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ నిధులపై ప్రశ్నల వర్షం కురిపించడంతో అధికారులు సమాధానాలు చెప్పలేక తికమక చెందారు. 

పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులు ఎందుకు మళ్లించారు? సచివాలయాలు పంచాయతీల్లో భాగం కాదా? ఉపాధి వేతనాల చెల్లింపుల్లో జాప్యానికి కారణమేంటి? అంటూ సూటిగా ప్రశ్నించారు. ఉపాధి హామీ పనుల్లో దుర్వినియోగమైన నిధుల రికవరీలో ఎందుకు వెనుకబడ్డారు? ఉపాధి కూలీలకు వేతనాల్లో చెల్లింపుల్లో జాప్యానికి కారణం ఎవరని నిలదీశారు. 

పవన్ నుంచి ఎదురైన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరైన అధికారులు సరిగా సమాధానాలు చెప్పలేక నీళ్లు నమిలారు. ఈ సమయంలో మళ్లీ కలగజేసుకున్న పవన్‌, తాను లేవనెత్తిన అంశాలపై మరోసారి సమగ్రంగా చర్చిద్దామని, సంసిద్ధులై ఉండాలని సూచించారు. వివిధ అంశాలపై అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వగా పవన్‌ తనకున్న, అనుమానాలను ప్రస్తావించారు. 

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్, కమిషనర్‌ కన్నబాబు వాటిని నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో పంచాయతీలకు సమాంతరంగా గ్రామ సచివాలయాల ఏర్పాటు అవసరం ఎందుకొచ్చింది? సర్పంచులకు వాటిపై పర్యవేక్షణ, నియంత్రణ ఎందుకు లేదు? అంటూ మౌలిక ప్రశ్నలు లేవనెత్తారు. గ్రామ సచివాలయాల్లో సర్పంచులకు కూర్చోడానికి కుర్చీలూ లేవా అని నిలదీశారు. 

కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు నేరుగా ఇవ్వకపోవడానికి కారణం ఏంటని ఆడిగారు. పంచాయతీలకు నిధులు, విధులు, అధికారాల విషయంలో కేరళలో అమలు చేస్తున్న అత్యుత్తమ విధానాలు ఆదర్శంగా ఉన్నాయని, ఏపీలోనూ అమలు చేసే విషయాన్ని పరిశీలించాలని ఆయన సూచించారు. సమగ్రంగా చర్చించి ఆ మేరకు ప్రణాళిక సిద్ధం చేయాలని పవన్‌ నిర్దేశించారు.

అధికారులు స్వేచ్ఛగా, త్రికరణ శుద్ధితో పని చేయొచ్చని అధికారులకు పవన్ స్పష్టం చేశారు. పరిపాలనలో రాజకీయ జోక్యం ఉండదని, ఎవరైనా జోక్యం చేసుకుంటే చెప్పాలని కోరారు. నిర్లక్ష్యానికి గురైన గ్రామీణ ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు అంతా కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. చెబితే నేర్చుకోడానికి తాను సిద్ధమేనని స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేద్దామని చెప్పారు. 

ఇందుకోసం ప్రయోగాత్మకంగా అరకులో పర్యటిద్దామని సూచించారు. గ్రామాల్లో ఎల్‌ఈడీ వీధి దీపాల వ్యవస్థను గాడిలో పెట్టాలని, గతంలో విజయవంతంగా అమలైన వ్యవస్థని వైఎస్సార్సీపీ ప్రభుత్వం పక్కన పెట్టడంతో ఊళ్లలో ఎల్‌ఈడీలు వెలగడం లేదని గుర్తు చేశారు. ప్రతి ఇంటికీ తాగునీటి కుళాయి కనెక్షన్‌ ఇచ్చే జల జీవన్‌ మిషన్‌ పథకం పనుల్ని గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.