కేజ్రీవాల్ బెయిల్‌ ఉత్తర్వులపై స్టే విధించిన హైకోర్టు

మద్యం కుంభకోణం కేసులో డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు అనూహ్య ఎదురుదెబ్బ తగిలింది. గురువారం డిల్లీ ప్రత్యేక న్యాయస్థానం మంజూరు చేసిన సాధారణ బెయిల్‌ను శుక్రవారం డిల్లీ హైకోర్టు నిలుపుదల చేసింది. రౌజ్‌ అవెన్యూ కోర్టు బెయిల్‌ మంజూరు చేయడాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు డిల్లీ హైకోర్టులో సవాల్‌ చేశారు. అత్యవసర విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. 

ఈ నేపథ్యంలో ట్రయల్‌ కోర్టులో విచారణ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సుధీర్ కుమార్ జైన్, జస్టిస్‌ రవీందర్ దూదేజాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. బెయిల్‌ను సవాల్‌ చేస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ను తాము విచారించే వరకు ట్రయల్ కోర్టు ఆదేశాలు అమలు కావని తెలిపింది.

కాగా లిక్కర్‌ స్కాం కేసులో మనీలాండరింగ్‌ అభియోగాలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్‌కు రౌజ్‌ అవెన్యూ కోర్టు గురువారం సాధారణ బెయిల్‌ మంజూరు చేసింది. లక్ష వ్యక్తిగత పూచీకత్తుతో విడుదల చేయవచ్చని ఆదేశించింది. అయితే ఈ తీర్పుపై పైకోర్టులో అప్పీలు దాఖలు చేయడానికి వీలుగా దానిని 48 గంటలపాటు పక్కనపెట్టాలని ఈడీ చేసిన వినతిని ట్రయల్‌ కోర్టు తిరస్కరించింది. 

శుక్రవారం ఆయన తిహాడ్‌ జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. ఈ క్రమంలో ఈడీ హైకోర్టును ఆశ్రయించింది. ట్రయల్‌ కోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ దర్యాప్తు సంస్థ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. “బెయిల్‌ను వ్యతిరేకించేందుకు మాకు సరైన అవకాశం లభించలేదు. వెకేషన్‌ బెంచ్ మా వాదనలను వినిపించేందుకు సరిపడా సమయం ఇవ్వలేదు” అని ఈడీ తరఫు న్యాయవాది అడిషనల్​ సొలిసిటర్ జనరల్​ ఎస్​వీ రాజు హైకోర్టుకు తెలిపారు.

 ట్రయల్‌ కోర్టు ఉత్తర్వులపై స్టే విధించి, తమ పిటిషన్‌పై అత్యవసర చర్యలు చేపట్టాలని పిటిషన్​లో అభ్యర్థించారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు దీనిపై శుక్రవారమే విచారణ జరుపుతామని వెల్లడించింది. అప్పటివరకు ట్రయల్‌ కోర్టు ఇచ్చిన బెయిల్‌ ఉత్తర్వులను అమలుచేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో కేజ్రీవాల్‌ ప్రస్తుతానికి జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లేకుండా పోయింది.

కాగా, బెయిల్ ఉత్తరువులు ఇంకా పూర్తిగా వెలువడకుండానే ఈడీ హైకోర్టును ఆశ్రయించడం పట్ల కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ విస్మయం వ్యక్తం చేశారు. తన భర్త కరడుగట్టిన ఉగ్రవాది మాదిరిగా వ్యవహరిస్తున్నారని ఆమె మండిపడ్డారు.