రామాయణాన్ని కించపరుస్తూ స్కిట్.. రూ.1.2 లక్షల ఫైన్‌

రామాయణాన్ని కించపరుస్తూ స్కిట్.. రూ.1.2 లక్షల ఫైన్‌

పవిత్ర ఇతిహాసం రామాయణాన్ని కించపరుస్తూ నాటకం  వేసిన విద్యార్థులకు ప్రతిష్ఠాత్మక ఐఐటీ బాంబే విద్యాసంస్థ భారీ జరిమానా విధించింది. ఒక్కో విద్యార్థికి ఏకంగా రూ.1.20 లక్షల చొప్పున జరిమానా వేసింది.

ఈ ఏడాది మార్చి 31వ తేదీన ఐఐటీ బాంబేలో వార్షిక ఆర్ట్స్‌ ఫెస్టివల్‌ జరిగింది. ఫెస్ట్‌లో భాగంగా కొందరు విద్యార్థులు ‘రాహోవన్‌  పేరుతో నాటకాన్ని ప్రదర్శించారు. రామాయణానికి ఇది పేరడీ. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వీడియోలు చూసిన పలువురు ఈ స్కిట్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 

నాటకంలో భాగంగా విద్యార్థులు ఉపయోగించిన భాష, హావభావాలు అనుచితంగా ఉన్నాయంటూ విమర్శలు చేస్తున్నారు. హిందువులు ఎంతో గొప్పగా భావించే రామాయణాన్ని కించపరిచారని ఆరోపించారు. మత విశ్వాసాలను దెబ్బ తీసేలా ఈ స్కిట్‌ ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీంతో ఐఐటీ బాంబే యాజమాన్యం చర్యలు చేపట్టింది. క్రమశిక్షణా కమిటీని ఏర్పాటు చేసి ఘటనపై దర్యాప్తు జరిపించింది. అనంతరం స్కిట్‌ ప్రదర్శించిన ఎనిమిది మంది విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. 8 మందిలో నలుగురికి ఒక్కొక్కరికి రూ.1.2 లక్షల జరిమానా విధించగా మరో నలుగురికి ఒక్కొక్కరికీ రూ.40 వేల జరిమానా వేసింది. 

దీంతోపాటు హాస్టల్‌ నుంచి డిబార్ చేసింది. మరో నెల రోజుల్లోగా ఈ జరిమానా చెల్లించాలని తేల్చి చెప్పింది. ఈ నిబంధనల్ని ఉల్లంఘిస్తే మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇన్‌స్టిట్యూట్‌కి చెందిన పెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌ ఫెస్టివల్‌ (పిఎఎఫ్‌) సందర్భంగా మార్చి 31న రామాయణాన్ని స్కిట్‌ రూపంలో ప్రదర్శించారు. ఈ స్కిట్‌పై ఓ వర్గం విద్యార్థులు ఫిర్యాదు చేశారు. హిందూ ఇతిహాసం రామాయణాన్ని అవమానించారని, హిందూ విశ్వాసాలు, దేవతలను అవమాన పరిచారని ఆరోపించారు. 

” స్త్రీవాదాన్ని ప్రోత్సహించడం” ముసుగులో సాంస్కృతిక విలువలను అపహాస్యం చేశారని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై మే 8న క్రమశిక్షణా కమిటీ విచారణ చేపట్టింది. జూన్‌ 4న జరిమానాలను విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ జరిమానాలను జులై 20 లోపు విద్యార్థి వ్యవహారాల డీన్‌ కార్యాలయంలో చెల్లించాలని, ఉల్లంఘిస్తే తదుపరి ఆంక్షలు తప్పవని హెచ్చరించింది.