రాజ్‌భవన్‌లో తనకు భద్రత లేదన్న బెంగాల్ గవర్నర్

పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వం, గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. గవర్నర్, దీదీ ఒకరిపై ఒకరు తరుచూ విమర్శలు గుప్పించుకోవడం పరిపాటిగా మారింది. తాజాగా, గవర్నర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు రాజ్‌భవన్‌లో భద్రత లేదని ఆయన ఆరోపించారు.

తన కార్యాలయంలో పూర్తిగా బెంగాల్ పోలీసులే మోహరించి ఉన్నారని ఆరోపణలు చేశారు. రాజ్ భవన్‌ ప్రాంగణం నుంచి ఖాళీ చేయాలని పోలీసులకు కొద్ది రోజుల కిందట గవర్నర్ ఆదేశాలు జారీచేశారు. అయితే, పోలీసు సిబ్బంది మాత్రం ఇప్పటికీ రాజ్ భవన్‌లోనే విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోపణలు చేయడం గమనార్హం.
 
‘‘ప్రస్తుత ఇంఛార్జ్ అధికారి, ఆయన బృందం రాజ్‌భవన్‌ ప్రాంగణంలో ఉండటం నా వ్యక్తిగత భద్రతకు ముప్పు… ఈ విషయాన్ని సీఎం మమతా బెనర్జీకి తెలియజేశాను. అయినా ఆమె నుంచి ఎలాంటి స్పందనా రాలేదు’ అని గవర్నర్ బోస్ వాపోయారు. ఇక్కడ పోలీసు సిబ్బంది నిరంతరం తనను స్నూపింగ్ చేస్తున్నారని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ ఫిర్యాదు చేశారు. కొందరి ప్రభావంతో పోలీసులు పని చేస్తున్నారని ఆరోపించిన ఆయన  వారిని తొలగించి కొత్త వారిని నియమించాలని కోరారు.
 
రాజ్‌భవన్‌ కాంట్రాక్ట్ ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు గవర్నర్‌పై వచ్చిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. ఘటన జరిగిందని చెప్పిన మే 2 నాటి సీసీటీవీ ఫుటేజీని ఆయన విడుదల చేయడం, ఎడిట్ చేసిన ఫుటేజ్‌ అని మమతా బెనర్జీ ఆరోపించడమే కాదు.. తన వద్ద వీడియోల పెన్‌డ్రైవ్ ఉందని ప్రకటించి రాజకీయ వేడిని మరింత పెంచారు. 
 
గవర్నర్‌ తన పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఆయన గవర్నర్‌గా ఉన్నంతకాలం తాను రాజ్‌భవన్‌కు వెళ్లనని మమత శపథం చేయడం గమనార్హం.