యూజీసీ నెట్ పేపర్ లీక్ తో పరీక్ష రద్దు

యూజీసీ నెట్ పేపర్ లీక్ తో పరీక్ష రద్దు

దేశవ్యాప్తంగా మంగళవారంనాడు నిర్వహించిన యుజిసినెట్ పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది.  పేపర్ లీక్ అయిందని నేషనల్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ కమిటీ సమాచారంతో ఎన్టీఏ యూజీసీ నెట్ పరీక్షను రద్దు చేసింది. యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి నెట్ ను అర్హత పరీక్షగా నిర్వహిస్తారు.

నేషనల్ టెస్టింగ్ ఏజె న్సీ (ఎన్‌టిఎ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్షలో అవకతవకలు చోటు చేసుకున్నట్లు గుర్తించామని, పరీక్షలో నిర్వహణలో పారదర్శకతకు కట్టుబడుతూ ఈ నిర్ణయం తీసుకున్నామని బుధవారంనాడు కేంద్ర విద్యాశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. అవకతవకలపై సిబిఐ విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలిపింది. 

అక్రమాలు నిగ్గు తేల్చాలని సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేసినట్లు వివరించింది. పరీక్షను త్వరలో తిరిగి నిర్వహించనున్నట్లు పేర్కొంది. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ పిహెచ్‌డి అడ్మిషన్ల కోసం 83 సబ్జెక్టులలో మంగళవారం రెండు సెషన్లలో యుజిసి నెట్ పరీక్ష జరిగింది.దేశవ్యాప్తంగా 317 నగరాలలో 1205 పరీక్షా కేంద్రాలలో జరిగిన ఈ పరీక్షలకు మొత్తం 11,21,225 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 

పరీక్షకు నమోదు చేసుకున్న అభ్యర్థులలో 81% మంది పరీక్షకు హాజరయ్యారని ఎన్టీఏ ప్రకటించింది గతంలో నెట్ పరీక్షను ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహించిన ప్రభుత్వం ఈ సారి పెన్ అండ్ పేపర్ మోడ్‌లో నిర్వహించిం ది. ఇప్పటికే ఎన్‌టిఎ ఆ ధ్వర్యంలోనే నిర్వహించిన నీట్ పరీక్షపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తాజాగా నెట్ పరీక్షలోనూ అవకతవకలు వెలుగు చూడటం కలకలం సృష్టిస్తోంది.

కాగా, నీట్ యుజి పరీక్ష-2024కి సంబంధించిన అంశంలో గ్రేస్ మార్కుల సమస్య ఇప్పటికే పూర్తిగా పరిష్కరించనట్లు ఎన్టీఏ ప్రకటించింది. పాట్నాలో పరీక్ష నిర్వహణలో జరిగిన కొన్ని అవకతవకలకు సంబంధించి, ఆర్థిక నేరాల విభాగం, బీహార్ పోలీసుల నుంచి నివేదికను కోరినట్లు తెలిపింది. ఈ నివేదిక అందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని పేర్కొంది.