వరి, పత్తి సహా 14 ఖరీఫ్‌ పంటలకు కనీస మద్దతు ధర

వరి, పత్తి సహా 14 ఖరీఫ్‌ పంటలకు కనీస మద్దతు ధర

ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో వరి, రాగులు, మినుము, జొన్న, మక్కజొన్న, పత్తి సహా 14 ఖరీఫ్‌ పంటలకు కనీస మద్దతు ధర  కల్పించేందుకు ఆమోదం తెలిపారు.  కేబినెట్‌ నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడించారు.

వరి కొత్త ఎంఎస్‌పీని రూ.2,300 నిర్ణయించినట్లు తెలిపారు. ఇది గత ఎంఎస్‌పీ కంటే రూ.117 ఎక్కువ. ఖరీఫ్ పంటల కొత్త ఎమ్మెస్పీపై అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ ఈ నిర్ణయంతో రైతులకు దాదాపు రూ.2లక్షల కోట్లు అందుతాయని వివరించారు. ఇది గత సీజన్ కంటే రూ.35వేల కోట్లు ఎక్కువ అని చెప్పారు.

వీటిలో పత్తి ఎంఎస్‌పిని సాధారణ రకానికి క్వింటాలుకు రూ 7,121గా ఖరారు చేశారు. మరో రకానికి ధరను రూ 7521 చేశారు. ఇది ఇంతకు ముందటి ధరలతో పోలిస్తే రూ 510 ఎక్కువ. జొన్నల కనీస మద్దతు ధరను రూ 3371 , రాగులల ధరలను రూ 4290, సజ్జల ధరలను రూ 2625గా ఖరారు చేయగా, మొక్కజొన్న ధరను క్వింటాలుకు రూ 2,225గా నిర్ణయించారు.

 పప్పు ధాన్యాల మద్దతు ధరలను కూడా పెంచారు.పెసర ధరలను క్వింటాలకు రూ 8,682, కంది పప్పు ధరను రూ 7550గా , మినపపప్పు ధరను రూ 7400గా నిర్ణయించారు. పొద్దుతిరుగుడు, పల్లీ మద్దతు ధరలను కూడా పెంచారు. వ్యవసాయ సాగు, ధరల కమిషన్ (సిఎసిపి) సిఫార్సుల మేరకు అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని కనీస మద్దతు ధరలను పెంచినట్లు మంత్రి తెలిపారు.

ఇదిలా ఉండగా, కేంద్రం 2లక్షల గోడౌన్ల నిర్మాణానికి కసరత్తు చేస్తున్నది. ఈ ప్రాజెక్టుతో పాటు మహాపాల్‌ఘర్- బధావన్ పోర్ట్ ప్రాజెక్ట్ ఆమోదం తెలిపింది. మహారాష్ట్రలో రూ.76వేల కోట్లతో వధవన్ పోర్ట్ ప్రాజెక్టుకు గ్రీన్‌ సిగ్నల్‌ చేసింది. రూ.76,200 కోట్లతో నిర్మించనున్న ఈ ఓడరేవు పూర్తయితే ప్రపంచంలోని టాప్ 10 పోర్టుల్లో ఒకటిగా నిలుస్తుంది. 

ఆఫ్‌షోర్‌ విండ్‌ ఎనర్జీ ప్రాజెక్ట్‌ల అమలు కోసం వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ (విజిఎఫ్‌) స్కీమ్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. మొత్తం రూ.7,453 కోట్లతో గుజరాత్, తమిళనాడులో గిగావాట్‌ ఆఫ్‌షోర్ పవన విద్యుత్ ప్రాజెక్టులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దేశంలో మొట్టమొదటి ఆఫ్‌షోర్‌ విండ్‌ ఎనర్జీ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడం ఈ పథకం లక్ష్యమని కేంద్ర మంత్రి తెలిపారు.

సెంట్రల్‌ సెక్టార్‌ స్కీమ్‌ ”నేషనల్‌ ఫోరెన్సిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఎన్‌హాన్స్‌మెంట్‌ స్కీమ్‌ (ఎన్‌ఎఫ్‌ఐఇఎస్‌)కి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. క్యాంపస్‌లు, ల్యాబ్‌లు, మౌలిక సదుపాయాల పెంపుదల కోసం రూ.2254.43 కోట్ల వ్యయం చేయనున్నారు.

వారణాసిలోని లాల్‌ బహదూర్‌ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.2869.65 కోట్లు అంచనా వ్యయంతో ప్రస్తుతం ఉన్న 3.9 మిలియన్ల ప్రయాణికులకు (ఎంపిపిఎ) నుండి 9.9 ఎంపిపిఎకి విమానాశ్రయం ప్రయాణికుల నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించనున్నట్లు తెలిపారు.