విద్యుత్‌ కోతల ట్వీట్‌పై జర్నలిస్టు రేవతిపై ఎఫ్‌ఐఆర్‌

తన నివాస ప్రాంత పరిధిలోని కరెంటు కోతలను ప్రస్తావించిన ఎల్బీనగర్‌కు చెందిన కృతికను విద్యుత్తు సిబ్బంది బెదిరించగా, రాచకొండ పోలీసులు ఒక అడుగు ముందుకేసి కృతిక బాధను ట్వీట్‌ చేసినందుకు జర్నలిస్టు రేవతిపై ఏకంగా పోలీస్‌ కేసు నమోదుచేశారు. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ పరిధిలో ఉన్న ఆటోనగర్‌కు చెందిన కృతిక కరెంటు కోతలను ప్రస్తావిస్తూ రెండు రోజుల కిందట ఎక్స్‌ వేదికగా పోస్టు చేయడం.. పోస్టు తొలగించాలంటూ విద్యుత్తు సిబ్బంది ఆమె ఇంటికి వెళ్లి బెదిరించడం జరిగింది. 
 
తనపై విద్యుత్తుశాఖ అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారని కృతిక పోస్ట్‌ చేయడంతో జర్నలిస్టు రేవతి ఆమెకు అండగా నిలిచారు. ఆమెతో మాట్లాడి ధైర్యం చెప్పే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. ఇదే విషయాన్ని రేవతి తన పోస్టులో వ్యక్తపరిచారు. సరూర్‌నగర్‌ డివిజన్‌ పరిధిలోని ఆటోనగర్‌ ఏఈ దిలీప్‌ రంగప్రవేశం చేసి తమ పరిధిలో విద్యుత్తు కోతలపై రేవతి అనే మహిళ ఎక్స్‌ వేదికగా దుష్ప్రచారం చేస్తున్నారని, ఆమె చెప్పినట్టు తమ పరిధిలో 7 గంటల విద్యుత్తు కోతలు లేవని, ఆమెపై చర్యలు తీసుకోవాలని ఏఈ ఎల్బీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఈ ఫిర్యాదు అర్ధరాత్రి 12.15 గంటలకు ఎల్బీనగర్‌ పోలీసులకు ఇవ్వటం గమనార్హం. ఈ ఫిర్యాదు ఇచ్చిందే తడవుగా ఎల్బీనగర్‌ పోలీసులు జర్నలిస్టు రేవతిపై కేసు నమోదు చేశారు. ఐపీసీ 505, 66డీ-ఐటీ(ఏ) యాక్ట్‌-2008 కింద ఎఫ్‌ఐఆర్‌ (నంబరు 662/2024) నమోదు చేశారు. తనపై కేసు నమోదైన విషయాన్ని రేవతి ఎక్స్‌ ద్వారా వెల్లడించారు. 
 
ప్రశ్నించినందుకు ఎఫ్‌ఐఆర్‌ రూపంలో నాకో బహుమానం అనే రీతిలో ‘మై మెడల్‌ ఆఫ్‌ హానర్‌: ఎఫ్‌ఐఆర్‌’ అని పోస్ట్‌ చేశారు. మహిళను వేధించిన తెలంగాణ పవర్‌ అండ్‌ కో వంటి అసలైన నేరస్థులను వదిలేసి తనపై కేసు నమోదు చేశారని ఎద్దేవా చేశారు. 
 
‘మీడియా స్వేచ్ఛ అంటే ఇదేనా రాహుల్‌? జర్నలిస్టుల గొంతు నొక్కాలని చూస్తున్నారా? ప్రజాస్వామ్యంపై నమ్మ కం ఉంటే ఈ విషయంలో నాకు న్యాయం చేసి, పత్రిక స్వేచ్ఛను కాపాడండి. ఇలా కేసులు పెట్టుకుంటూ పోతే ప్రజలకు న్యాయం చేయాల్సిన మీడియాను ఎవరు కాపాడుతా రు?’ అంటూ మరోసారి ఆమె విరుచుకుపడ్డారు. 
 
ఈ ట్వీట్‌ను రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీతోపాటు సీఎం రేవంత్‌రెడ్డి అకౌంట్లకు ట్యా గ్‌ చేశారు. రేవతిపై కేసు నమోదు చేయటంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజా సమస్యలను ఎత్తిచూపితే కేసులు పెడతారా? అని ఆమెకు అండగా నిలిచారు. విద్యుత్తుశాఖ వివరణ ఇవ్వాల్సిన అంశంలో పోలీసులు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు? అని విరుచుకుపడ్డారు. ఒక మహిళా నెటిజన్‌ ఆవేదనతో.. సమస్య మీద పోస్టు చేస్తే ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీయటం ఎలా అవుతుంది? ఏ తరహా ప్రజా పాలన ఇది? అని వారంతా నిలదీశారు.