కొత్త డీజీపీ ద్వారకా తిరుమలరావు

కొత్త డీజీపీ ద్వారకా తిరుమలరావు

డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తాను రాష్ట్రప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసింది. కొత్త డీజీపీగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ద్వారకాతిరుమలరావును నియమించింది. ఈ మేరకు సీఎస్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ బుధవారం రాత్రి ఉత్తర్వులిచ్చారు. ఎన్నికల సమయంలో నాటి డీజీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డిని ఈసీ తొలగించి హరీశ్‌కుమార్‌ గుప్తాను నియమించింది. 

ఆయన్నే కొనసాగించాలని కొత్త ప్రభుత్వం కూడా భావించింది. కానీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం సందర్భంగా జరిగిన గందరగోళం ఆయనకు ప్రతికూలంగా మారింది. ఆ రోజున ట్రాఫిక్‌ అస్తవ్యస్తంగా మారింది. గన్నవరం విమానాశ్రయంలో ప్రధాని మోదీకి స్వాగతం పలికి.. తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబుతో పదవీప్రమాణం చేయించాల్ని రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. 

ఆయన కాన్వాయ్‌ దాదాపు 40 నిమిషాలు నిలిచిపోయింది. దీంతో ఆయన ప్రధాని మోదీ స్వాగత కార్యక్రమానికి రాలేకపోయారు. ఆ రోజు ట్రాఫిక్‌ నియంత్రణలో విషయంలో డీజీపీ గుప్తా పూర్తిగా విఫలమయ్యారు. చివరికి ఆయనే స్వయంగా రంగంలోకి దిగి గవర్నర్‌ కాన్వాయ్‌కు ట్రాఫిక్‌ క్లియర్‌ చేయాల్సి వచ్చింది. ఈ మొత్తం వ్యవహరంపై ప్రధాని మోదీ కూడా అసహనం వ్యక్తం చేశారు. చివరకు తిరుగు ప్రయాణ సమయంలో తనకు వీడ్కోలు పలికేందుకు గన్నవరం విమానాశ్రయానికి ఎవరు రావద్దంటూ ఒక్కరే వెళ్లిపోయారు.

1989 బ్యాచ్‌ ఐపీఎస్ అధికారైన ద్వారకా తిరుమలరావు ప్రస్తుతం రాష్ట్ర క్యాడర్‌ ఐపీఎస్‌ల సీనియారిటీ జాబితాలో అందరికంటే ముందున్నారు. కర్నూలు ఎఎస్​పీగా మొట్ట మొదటి పోస్టింగ్‌ అందుకున్న ద్వారకా తిరుమలరావు, ఉమ్మడి రాష్ట్రంలో కామారెడ్డి, ధర్మవరంలోనూ ఎఎస్​పీగా పని చేశారు. నిజామాబాద్‌ జిల్లా ఆపరేషన్స్‌ విభాగం అదనపు ఎస్పీగా కీలక బాధ్యతలు నిర్వహించారు. 
 
ఎస్పీగా పదోన్నతి పొందాక అనంతపురం, కడప, మెదక్‌ జిల్లాలతో పాటు విజయవాడ రైల్వే, సీఐడీ, సీబీఐ విభాగాల్లో ఎస్పీగా పని చేశారు. అనంతపురం, హైదరాబాద్‌ రేంజ్‌లతో పాటు ఎస్ఐబీలో డీఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆక్టోపస్, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ సెల్‌ విభాగాల్లో ఐజీగా పని చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌గా, రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ నగర పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 
 
2021 జూన్‌ నుంచి ఆర్టీసీ ఎండీగా ఉన్నారు. ద్వారకా తిరుమలరావుకు నిక్కచ్చిగా వ్యవహరించే సమర్థ అధికారిగా పోలీసు శాఖలో గుర్తింపు ఉంది.
సాధారణంగా డీజీపీని సెలెక్షన్‌ కమిటీ ఎంపిక చేస్తుంది. ప్రస్తుతం సమయం లేకపోవడంతో ప్రభుత్వం నియమించింది. నేరుగా డీజీపీ పోస్టు ఇవ్వకుండా డీజీపీ (కో-ఆర్డినేషన్‌) పోస్టులో నియమించింది. 
ఆ స్థానంలో ఉండి ఆయన డీజీపీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొంది. గుప్తాకు తిరిగి హోంశాఖ ముఖ్య కార్యదర్శి బాధ్యత అప్పగించింది.
తిరుమలరావు కృష్ణ నగర్‌లోని మున్సిపల్‌ స్కూల్లో ఐదో తరగతి వరకు, తర్వాత లక్ష్మీపురంలోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్‌లో పదో తరగతి వరకు చదివారు. కొంత కాలం గుంటూరు టీజేపీస్‌ కళాశాలలో మేథమేటిక్స్‌ లెక్చరర్‌గా పని చేశారు. సెంట్రల్‌ యూనివర్సిటీలో మేథ్స్‌ విభాగంలో గోల్డ్‌మెడల్‌ సాధించారు. 1989లో ఆయన ఐపీఎస్కు ఎంపికయ్యారు. ఆయన భార్య వైద్య విభాగంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.