ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం బాధ్యతలు తీసుకున్నారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దస్త్రాలపై సంతకాలు చేశారు. అదేవిధంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్, పర్యావరణ, శాస్త్రసాంకేతిక, అటవీ శాఖ మంత్రిగానూ పవన్ బాధ్యతలు చేపట్టారు.
పంచాయితీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషన్ కుమార్‌తో పాటు ఇతర అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ఉపాధి హామీ పథకానికి ఉద్యానవన పనులను అనుసంధానించే నిధుల మంజూరు దస్త్రంపై, గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణ దస్త్రంపై సంతకాలు చేశారు. అలాగే పలు దస్త్రాలపై ఆయన సంతకాలు చేశారు.
అనంతరం సోదరుడు నాగబాబు, వివిధ శాఖల అధికారులు, ఎమ్మెల్యేలు, నేతలు పవన్‌కు అభినందనలు తెలిపారు. బాధ్యతలు చేపట్టిన పవన్ కల్యాణ్‌కు మంత్రులు, జనసేన నేతలు అభినందనలు తెలిపారు. ఆయన్ను కలిసిన వారిలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్, ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, టీడీపీ నేత, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తదితరులు ఉన్నారు.
ఉపముఖ్యమంత్రి హోదాలో పవన్ కల్యాణ్ తొలిసారిగా మంగళవారం సచివాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా అమరావతి రైతులు, మహిళలు, కూటమి నాయకులు, ఉద్యోగులు పవన్ కల్యాణ్‌కు ఘనస్వాగతం పలికారు. సచివాలయానికి చేరుకున్న పవన్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాగతం పలికారు. ఇద్దరూ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మరోవైపు పవన్ కల్యాణ్ భద్రతను కూడా ఏపీ ప్రభుత్వం పెంచింది. వై ప్లస్ సెక్యూరిటీతో పాటు బుల్లెట్‌ప్రూఫ్ కారును కేటాయించారు.

More Stories
పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయాలి
విశాఖలో కంటైనర్ మెగా పోర్టు..నీతి ఆయోగ్
కర్నూలు బస్సు ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి