ఐదేళ్లలో 64 శాతం పెరిగిన ఇండ్ల అద్దెలు

ప్రజల ఆదాయాల్లో పెరుగుదల లేకపోయినప్పటికీ నివాస అద్దెలు మాత్రం నింగిని అంటుతున్నాయి. గడిచిన ఐదేళ్లలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో అద్దెలు 64 శాతం పెరిగాయని రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ అనరాక్‌ వెల్లడించింది. 2019 నుంచి దేశంలో వేగంగా అద్దెలు పెరిగాయని తెలిపింది.  అనరాక్‌ రిపోర్ట్‌ ప్రకారం దేశంలోని ఢిల్లీ-ఎన్‌సిఆర్‌, ముంబయి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ (ఎంఎంఆర్‌), చెన్నై, కోల్‌కత్తా, పూణె, హైదరాబాద్‌, బెంగళూరు తదితర ఏడు ప్రధాన నగరాల్లో 1,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న రెండు పడక గదుల ఇంటి అద్దెలు భారీగా ఎగిశాయి.

దేశ రాజధాని సమీపంలోని నేషనల్‌ కాపిటల్‌ రీజియన్‌ (ఎన్‌సిఆర్‌)లో 2018-19లో రూ.15,500గా ఉన్న సగటు అద్దె గడిచిన 2023-24 నాటికి 63.3 శాతం పెరిగి రూ.25,000కు చేరింది. దక్షిణ ఢిల్లీలో అద్దెలు 43.5 శాతం పెరిగి రూ.19,500 నుంచి రూ.28,000కు చేరాయి. ముంబయి మెట్రోపాలిటన్‌ రీజియన్‌లోని చెంబూర్‌లో రెండు పడక గదుల ఇంటికి అత్యధికంగా రూ.63,500 సగటు అద్దె చోటుచేసుకుంది. ఇక్కడ 2019లో రూ.45,000గా ఉన్న అద్దెతో పోల్చితే 41.1 శాతం పెరుగుదల నమోదయ్యింది. 

బెంగళూరులోని సర్జాపూర్‌ రోడ్‌లో సగటు అద్దె రూ.35,000కు చేరింది. 2019లో ఇక్కడ అద్దె రూ.21వేలుగా ఉంది. ప్రస్తుత ఏప్రిల్‌ – జూన్‌ త్రైమాసికంలో ఇప్పటి వరకు నివాస గృహాల అద్దెల్లో 2-4 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. మార్చి త్రైమాసికంలో 4-9 శాతం వరకు పెరిగాయని అనరాక్‌ రిపోర్ట్‌ పేర్కొంది. 

2024 జూన్‌ త్రైమాసికం(క్యూ2)లో నోయిడా సెక్టార్‌లో అద్దెలు సగటున 4 శాతం పెరగ్గా.. మార్చి త్రైమాసికంలో 9 శాతం పతనం చోటు చేసుకుంది.  క్యూ2లో గూర్‌గావ్‌, ద్వారకలో అద్దెలు 3 శాతం, 2 శాతం చొప్పున పెరిగాయి. మార్చి త్రైమాసికంలో హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల అద్దెల్లో 5 శాతం పెరుగుదల ఉండగా, జూన్‌ త్రైమాసికం అద్దెల్లో 3 శాతం పెరుగుదల నమోదైంది.

” జూన్‌ త్రైమాసికంలో సాధారణంగా నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో కొత్త సిబ్బంది నియామకం కారణంగా అద్దెలు ఇతర త్రైమాసికాల కంటే ఎక్కువగా పెరుగుతాయి” అని అనరాక్‌ గ్రూప్‌ వైస్‌ ఛైర్మన్‌ సంతోష్‌ కుమార్‌ తెలిపారు. ఈ ఏడాది కొత్త నివాసాలు పెరుగుతున్న నేపథ్యంలో అద్దెల్లో తగ్గుదల ఉండొచ్చని భావిస్తున్నారు. 

దేశంలోని ఏడు అతిపెద్ద నగరాలు 2024లో 5.31 లక్షల కొత్త యూనిట్లను డెలివరీ చేయబోతున్నాయని అనరాక్‌ అంచనా. ఇది 2023లో డెలివరీ చేయబడిన 4.35 లక్షల యూనిట్ల కంటే 22 శాతం ఎక్కువ. ఈ ఏడాది అత్యధిక యూనిట్లు ముంబయి మెట్రోపాలిటన్‌ రీజియన్‌లో 1,60,900, ఆ తర్వాత ఎన్‌సిఆర్‌ పరిధిలో 1,44,397 యూనిట్లు, పూణెలో 97వేల చొప్పున నివాసాలు అందుబాటులోకి రానున్నాయని అనరాక్‌ అంచనా వేసింది.