ఉపాధ్యాయ పదోన్నతులపై హైకోర్టు ఆగ్రహం

ఉపాధ్యాయ పదోన్నతులపై హైకోర్టు ఆగ్రహం
తెలంగాణాలో పాధ్యాయుల పదోన్నతులకు సంబంధించిన వివాదం కోర్టులో పెండింగ్‌లో ఉన్నా ప్రక్రియను ఎలా కొనసాగిస్తారని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)తో సంబంధం లేకుండా పదోన్నతులు కల్పించాలన్న ఏకసభ్య ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. అయినా ఆ ఉత్తర్వులను డివిజన్ బెంచ్ రద్దు చేస్తూ వెనక్కు పంపిన విషయం తెలిసీ ఎలా చేపడతారని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేనను ప్రశ్నించింది. ఇది కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని పేర్కొంది.

గతంలో టెట్​కు సంబంధించి రెండు వేర్వేరు ఉత్తర్వులున్నందున రెండింటినీ పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సింగిల్​ జడ్జికే వివాదాన్ని పంపింది. ఈ విషయం తెలిసి కూడా ప్రక్రియను ఎలా చేపడతారని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. స్కూలు అసిస్టెంట్ పోస్టుల పదోన్నతుల్లో భాగంగా టెట్​లో అర్హత సాధించని ఎస్​జీటీలకు అవకాశం కల్పించకపోవడాన్ని సవాలు చేస్తూ 150 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

దీనిపై విచారించిన సింగిల్ జడ్జి టెట్​తో సంబంధం లేకుండా పదోన్నతులు కల్పించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ 52 మంది హైకోర్టులో అప్పీలు దాఖలు చేశారు. దీనిపై ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరపున వాదించిన న్యాయవాది రాజశేఖర్ టెట్ అర్హత లేనివారికి స్కూల్ అసిస్టెంట్ పోస్టుల పదోన్నతులకు అవకాశం కల్పిస్తే అన్యాయం జరుగుతుందని తెలిపారు. 

ఐతే అభ్యర్థులు 1995- 2008 మధ్య ఎస్​జీటీలుగా నియమితులయ్యారని ప్రతివాదుల తరఫున న్యాయవాది ఎం. రాంగోపాల్ రావు వాదించారు. కానీ ఎస్​సీటీఈ నోటిఫికేషన్ 2010లో వచ్చిందని తెలిపారు. ఎస్​సీటీఈ నిబంధనల ప్రకారం స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు టెట్ అర్హత తప్పనిసరని,అందువల్ల నోటిఫికేషన్​కు ముందు నియమితులైనవారికి టెట్ అవసరంలేదంటూ 2015లో ప్రభుత్వం జీవో 36 జారీ చేసిందని పేర్కొన్నారు. ఇందులో 12వ నిబంధన ఇదే విషయాన్ని స్పష్టంగా చెబుతోందని, తర్వాత కూడా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు టెట్ తప్పనిసరని ఎప్పుడూ నోటీసు కూడా ఇవ్వలేదని తెలిపారు.