తెలంగాణాలో గనులు వేలం వేస్తారా?  వేయమంటారా?

“తొమ్మిదేళ్లు దాటింది, తెలంగాణాలో ఏ ఒక్క ఖనిజ క్షేత్రానికి వేలం వేయలేదు. జూన్ 30వరకు కనీసం ఆరు బ్లాక్‌లకు వేలం నిర్వహించాలి. ఒకవేళ మీరు ఆ పని చేయలేకపోతే మేమే అందుకు పూనుకుంటాం”అని కేంద్ర గనుల మంత్రిత్వశాఖ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదివారం నాడు ఘాటైన లేఖ రాసింది. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో అత్యంత విలువైన మినరల్స్ గనులు ఉన్నాయి. ఈ విషయాన్ని సశాస్త్రీయ సర్వేల తరువాత భూగర్భ పరిశోధనా విభాగం నిర్థారించింది.

ఇప్పటికే 11 బ్లాక్‌లకు సంబంధించిన జియాలాజికల్ రిపోర్టులను తెలంగాణ ప్రభుత్వానికి అందించారు. వీటిని వేలం వేయాలని సూచించారు. వీటిలో ఐదు ఇనుప ఖనిజాలు, ఐదు సున్నపురాయి గనుల క్షేత్రాలు ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఒక్కటి మెగ్నీషియం బ్లాక్ ఉంది. పలు సార్లు కేంద్ర గనుల మంత్రిత్వశాఖ వీటి వేలం గురించి గుర్తు చేస్తూ వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశలో చర్యలు తీసుకోలేదు. 

తెలంగాణలో మినరల్ బ్లాక్‌లను వేలం ప్రక్రియ ద్వారా కేటాయించే ప్రక్రియ 2015లో ఆరంభమైంది. అసాధారణ పరిస్థితులలో అంటే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సరైన స్పందన లేకపోతే మినరల్ బ్లాక్‌లను కేంద్రమే వేలం వేసేందుకు వీలు కల్పించేలా 2021లో మైనింగ్ రూల్స్‌కు సవరణ చేశారు.  పరస్పర ఒప్పందం మేరకు సకాలంలో వేలం వేయాల్సి ఉంటుంది. లేకపోతే ఈ ప్రక్రియ కేంద్రం పరిధిలోకి వెళ్లుతుంది.

విలువైన ఖనిజాల వేలం ప్రక్రియల సంబంధిత వ్యవస్థను దేశంలో ప్రవేశపెట్టిన తరువాత మొత్తం మీద 354 ప్రధాన మినరల్ బ్లాక్‌ల ఆక్షన్ జరిగింది. వీటిలో ఇప్పటివరకూ 48 బ్లాక్‌లలో తవ్వకాలు , ఉత్పత్తి ఆరంభమయ్యాయి. రాష్ట్రాలలోని మినరల్ బ్లాక్‌ల వేలం ద్వారా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయ వనరులు గణనీయంగా పెరిగాయి.

భూగర్భ నిక్షిప్త గనులను వెంటవెంటనే వేలం వేయడం , అక్కడ ఉత్పత్తి ఆరంభమయ్యి, స్థానిక ప్రజలకు ఉపాధి పనిలో పనిగా రాష్ట్ర ప్రభుత్వాలకు సరైన విధంగా ఆర్థిక ప్రగతికి దోహదమవుతుంది. నిర్దిష్ట రీతిలో సరైన ఆదాయ వనరులు ఖరారు అవుతాయి.  ఇంతటి ప్రయోజనాల మిళిత ఈ గనుల వేలం ప్రక్రియకు ఇన్నేళ్లుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు బ్రేక్‌లు వేసిందనేది కీలకమైంది.

ఇటీవలే కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణకు చెందిన బిజెపి నేత జి కిషన్ రెడ్డి గనులు శాఖ మంత్రి అయిన దశలో ఇప్పుడు కేంద్రం స్పందించడం, ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వానికి కేవలం పక్షం రోజుల సమయం ఇవ్వడం, ఈ దశలోనే ఇంతకు ముందటి వరకూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్ పూర్వపు సర్కారుకు చివాట్లు పెట్టడం కీలక పరిణామం అయింది.