టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు

తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్ ను టీడీపీ జాతీయాధ్యక్షు డు చంద్రబాబు నాయుడు నియమించారు.విశాఖపట్నం పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా సమర్థవంతంగా పనిచేసిన శ్రీనివాసరావు యాదవ్ నూతన బాధ్యతలు విజయవంతంగా నిర్వహిస్తారని ఆశిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. 
 
అలాగే ఇప్పటి వరకూ రాష్ట్ర అధ్యక్షుడిగా టీడీపీ సమర్థవంతంగా నడిపి, అద్భుత పనితీరు కనబరిచిన పార్టీ సీనియర్ నేత, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు అభినందనలు తెలిపారు. ప్రతిపక్షంలో అనేక సమస్యలు, సవాళ్లను ఎదుర్కొని పార్టీ బలోపేతానికి అచ్చెన్నాయుడు ఎనలేని కృషి చేశారని చంద్రబాబు కొనియాడారు.

ఇప్పటి వరకూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కింజరాపు  అచ్చెన్నాయుడుకు కేబినెట్ లో స్థానం దక్కింది. దీంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు మరొకరికి అప్పగించాలని చంద్రబాబు భావించారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఎన్నికల్లో విశాఖ జిల్లా గాజువాక నుంచి ఎమ్మెల్యే రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీగా గెలిచిన పల్లా శ్రీనివాసరావుకు రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం కల్పించారు. 

ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌పై పల్లా శ్రీనివాసరావు రాష్ట్రంలోని అత్యధికంగా 95,235 ఓట్ల తేడాతో విజయం సాధించారు. విశాఖ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించిన పల్లా శ్రీనివాసరావు పార్టీ కోసం చాలా శ్రమించారు. ఒకానొక దశలో ఆయన పార్టీని వీడుతున్నట్లు ప్రత్యర్థులు ప్రచారం కూడా చేశారు. అయినా పార్టీని విడలేదు.

రాష్ట్ర విభజన అనంతరం టిడిపి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇప్పటి వరకు రెండుసార్లు ఉత్తరాంధ్ర నేతలకే దక్కింది. రాష్ట్ర విభజన తర్వాత తొలసారిగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కళా వెంకట్రావును చంద్రబాబు నియమించారు. అనంతరం గత ఐదేళ్లుగా ఉత్తరాంధ్రకే చెందిన అచ్చెన్నాయుడుకు బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు మరోసారి ఉత్తరాంధ్రకే చెందిన బీసీ నేత పల్లా శ్రీనివాసరావును టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడుగా నియమించారు.