పాఠ్యపుస్తకాల్లో ద్వేషం, హింసకి తావులేదు

ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ సక్లాని స్పష్టం
కొత్తగా సవరించిన నేషనల్ కరిక్యులమ్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ) పాఠ్యపుస్తకాలలో అంశాలపై తలెత్తిన వివాదాలపై దాని డైరెక్టర్ దినేష్ ప్రసాద్ సక్లానీ స్పందిస్తూ, “పాఠ్యాంశాలను కాషాయీకరణ చేసే ప్రయత్నాలు లేవు”, అన్ని మార్పులు “సాక్ష్యం, వాస్తవాల” ఆధారంగా ఉన్నాయని స్పష్టం చేశారు. చిన్నతనంలోనే హింస, ద్వేషం వంటి అంశాలు బోధించి విద్యార్థుల మెదళ్లను పాడు చేయొద్దని హితవు చెప్పారు. 
 
ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో   పాఠశాలల్లో చరిత్రను వాస్తవాలు చెప్పడానికే బోధిస్తున్నారని, దానిని “యుద్ధభూమి”గా మార్చడానికి కాదని సక్లానీ తెలిపారు.  ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల్లో గుజరాత్ అల్లర్లు లేదా బాబ్రీ మసీదు కూల్చివేత గురించి ప్రస్తావించడం గురించి సక్లానీని ప్రశ్నించగా, “మనం పాఠశాల పాఠ్యపుస్తకాల్లో అల్లర్ల గురించి ఎందుకు బోధించాలి?” అని ప్రశ్నించారు.
 
“మేము హింసాత్మక, నిస్పృహ ధోరణులు గల వ్యక్తులను కాకుండా సానుకూల పౌరులను సృష్టించాలనుకుంటున్నాము” అని చెప్పారు. “మన విద్యార్థులు అభ్యంతరకరంగా మారేలా, సమాజంలో ద్వేషాన్ని సృష్టించేలా లేదా ద్వేషానికి బలి అయ్యే విధంగా వారికి బోధించాలా? విద్య ఉద్దేశం అదేనా?” అంటూ నిలదీశారు. అల్లర్ల గురించి పెద్దయ్యాక నేర్చుకోవవచ్చని పాఠశాల పుస్తకాలలోనే ఎందుకు నేర్పాలని ఆయన విస్మయం వ్యక్తం చేశారు.
 
“వారు పెద్దయ్యాక ఏమి జరిగిందో మరియు ఎందుకు జరిగిందో అర్థం చేసుకోనివ్వండి. మార్పుల గురించి ఏడ్పులు అసంబద్ధం,” అంటూ విమర్శలను కొట్టిపారవేసారు. కొత్త పాఠ్యపుస్తకాలు అనేక తొలగింపులు, మార్పులతో మార్కెట్‌లోకి వచ్చిన సమయంలో సక్లానీ ఈ  వ్యాఖ్యలు చేశారు. సవరించిన 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పాఠ్యపుస్తకం, బాబ్రీ మసీదు గురించి ప్రస్తావించలేదు, కానీ దానిని “మూడు గోపురాల నిర్మాణం”గా సూచిస్తుంది.
 
ఇది అయోధ్య విభాగాన్ని నాలుగు నుండి రెండు పేజీల వరకు తగ్గించింది. గుజరాత్‌లోని సోమనాథ్ నుండి అయోధ్య వరకు బిజెపి ‘రథయాత్ర’; కర సేవకుల పాత్ర; బాబ్రీ మసీదు కూల్చివేత నేపథ్యంలో మత హింస; బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన; అయోధ్యలో జరిగిన సంఘటనలపై బిజెపి విచారం వంటి అంశాలను కూడా తొలగించారు. 
 
 పాఠ్యపుస్తకాలలో మార్పులు, చేర్పులు అనేవి ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంటాయని ఆయన చెప్పారు.  ఏదైనా అసందర్భంగా మారితే, దానిని మార్చవలసి ఉంటుందని తెలిపారు. పాఠ్య పుస్తకాలలో మార్పులు, చేర్పులు అనేవి సంబంధిత నిపుణుల పర్యవేక్షణలో జరుగుతూ ఉంటుందని చెబుతూ ఈ విషయంలో తాను ఎటువంటి ఆదేశాలు ఇవ్వడం గాని, జోక్యం చేసుకోవడం గాని జరగదని స్పష్టం చేశారు.
 
‘‘రామ మందిరం, బాబ్రీ మసీదు లేదా రామజన్మభూమికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిస్తే, దానిని మన పాఠ్యపుస్తకాల్లో చేర్చకూడదా? అందులో సమస్య ఏమిటి? మేము నూతన పరిణామాలను చేర్చాము. మనం కొత్త పార్లమెంటును నిర్మిస్తే, మన విద్యార్థులకు దాని గురించి చెలియకూడదా? పురాతన పరిణామాలు, ఇటీవలి పరిణామాలను చేర్చడం మా కర్తవ్యం” అని ఆయన స్పష్టం చేశారు.
 
“భారతీయ జ్ఞాన వ్యవస్థ గురించి మనం చెపుతున్నట్లయితే, అది కాషాయీకరణ ఎలా అవుతుంది? మెహ్రౌలీలోని ఇనుప స్థంభం గురించి చెబుతూ, భారతీయులు ఏ లోహశాస్త్ర శాస్త్రవేత్త కంటే ముందున్నారని చెబుతున్నా, మనం తప్పుగా చెబుతున్నామా? అది కాషాయీకరణ ఎలా అవుతుంది?” అంటూ ఆయన ప్రశ్నించారు.