రిషికొండలో రాచరికంను మరిపించే జగన్ ప్యాలెస్!

వైసిపి ప్రభుత్వ హయాంలో అత్యంత గోప్యంగా ప్రతిపక్షాలను, న్యాయస్థానాలను మభ్యపెడుతూ రుషికొండపై అప్పటికే ఉన్న టూరిజం రిసార్ట్‌ ను ధ్వంసం చేసి నిర్మించిన నిర్మాణాలు పూర్తిగా వ్యక్తిగత నివాసాలకు సీఎంఓ ఆఫీస్‌ కు అనుకూలంగా నిర్మించారని టిడిపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. ఇప్పటివరకు ఎవ్వరూ అటువైపు వెళ్లకుండా ప్రభుత్వం కట్టడి చేయగా, తాజాగా గంటా శ్రీనివాసరావు చొరవతో ఆదివారం ఈ నిర్మాణాల వద్దకు కూటమి పక్షాల నేతలను, మీడియాను అనుమతించారు.

పూర్తిగా 7 బ్లాక్‌ లుగా నిర్మించిన ఈ నిర్మాణాలలో మూడు బ్లాకులలో జగన్మోహన్‌ రెడ్డి అత్యంత విలాసవంతమైన గృహ సముదాయాన్ని నిర్మించుకోగా, మిగిలిన 4 బ్లాకులు ఒకటి సీఎంఓ కార్యాలయానికి, ఒకటి ప్రధాన అధికారుల ఛాంబార్లకు అనుకూలంగాను, మిగిలిన రెండు బ్లాక్‌ లుగా సాధారణ అధికారుల కార్యాలయలకు అనుకూలంగా ఉండే విధంగా సుమారు రూ.500 కోట్ల వ్యయంతో నిర్మించారు.

ఈ నిర్మాణాలు పూర్తి సెంట్రల్‌ ఏసి కలిగి అత్యంత విలాసవంతంగా పూర్తి గ్రానైటెడ్‌ ఫినిషింగ్‌ తో అత్యాధునిక ఎలక్ట్రిక్‌ టెక్నాలజీ, భారీ స్క్రీన్లు విశాలవంతమైన బెడ్రూంలు, బాత్రూంలో కలిగి ఉన్నాయి. అంతేకాకుండా బాత్రూం లో ఉన్న డోర్లకు సైతం సెన్సార్లు కలిగిన లాకింగ్‌ సిస్టం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇక రూ.26 లక్షల విలువచేసే బాత్ టబ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం గా మారింది.
 
‘అధికారంలోకి వస్తే తన భార్యకి బీచ్ సైడ్ ప్యాలెస్ గిఫ్ట్‌గా ఇస్తా అని చెప్పి, ప్రభుత్వ సొమ్ముతో ఇలా విచ్చలవిడితనం చేశాడు’ అంటూ టీడీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. పచ్చటి టూరిజం రిసార్ట్‌ ను అన్యాయంగా కూల్చివేసి, విలాసవంతంగా కట్టడాలను కట్టారని ముందు టూరిజం రిసార్ట్‌ అని మరి కొంతకాలం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం అన్నారని చెప్పారు. 
 
గతం లో అనుమతులు లేవని ప్రజవేదికను కూల్చారని, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక ప్రభుత్వ ఆస్తిని ప్రభుత్వం కూల్చివేసిందని, కేవలం విధ్వంసం సృష్టించాలని ప్రజా వేదికను జే.సీ.బి లతో కూల్చివేశారని ఆరోపించారు. రుషికొండ నిర్మాణాలపై కోర్టులు కూడా పలు నివేదికలు ఇచ్చినా, ఈ నిర్మాణం ప్రారంభం కూడా అత్యంత రహస్యంగా పర్యాటక మంత్రి రోజా చేశారని ఎంతో ముచ్చట పడి కుట్టుకున్న నిర్మాణం చివరికి ఆయన చూసుకోకుండా ప్రజలు ఆయనకు సరైన తీర్పు ఇచ్చారని ఎద్దేవా చేస్తున్నారు.
ఇదిలా ఉంటే సీఎం ఓ కార్యాలయం అనుకూలంగా నిర్మించిన 2 వ బ్లాక్‌ లో ఒక మినీ థియేటర్‌ తలపించే విధంగా 200 కుర్చీలతో ఒక మీటింగ్‌ హాలు, జగన్‌ మోహన్‌ రెడ్డి కోసం ఒక భారీ ఛాంబర్‌ ను కూడా ఏర్పాటు చేశారు. వీటితోపాటు ప్రధాన అధికారులు సలహాదారుల కోసం ఒక్కో అంతస్తులో సుమారు 20 అత్యాధునిక సాంకేతిక వసతులు కలిగిన రూములను ఏర్పాటు చేశారు.
 
2019 లో ఒక్క ఛాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చారు జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వంపై ఎవరు ప్రశ్నించినా అక్రమ కేసులు పెట్టేవారని, గతంలో అసెంబ్లీ సాక్షిగా జగన్‌ మోహన్‌ రెడ్డి అమరావతి రాజధాని అని చెప్పారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక విశాఖలో రాజధాని, అదే విధంగా మూడు రాజధానులు అని యు టర్న్‌ తీసుకున్నారని విమర్శించారు.
 
రుషికొండపై పర్యాటక రిసార్టు నిర్మాణం పేరిట ప్రకృతి విధ్వంసానికి పాల్పడ్డారు. నిక్షేపంగా ఉన్న ‘హరితా హిల్‌ రిసార్టు’ భవనాలు పాతవైపోయాయని కూల్చేశారు. కొండను అక్రమంగా తవ్వేస్తున్నారని, నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణాలు చేపడుతున్నారని నిపుణులు, పర్యావరణవేత్తలు, ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు ఎంత గగ్గోలు పెట్టినా వైఎస్సార్సీపీ ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదు.
 
 భారీ యంత్రాలతో రాత్రింబవళ్లు కొండను తవ్వేసి బోడిగుండు చేసేశారు. న్యాయపరమైన వివాదాలు చుట్టుముట్టినా పట్టించుకోకుండా ముందుకెళ్లారు. నిపుణుల కమిటీ రుషికొండపై సర్వే చేపట్టి పలు ఉల్లంఘనలు జరిగాయని తేల్చినా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఎంతో హడావుడి చేసి, ఎంత మంది అడ్డుచెప్పినా పెడచెవిన పెట్టి, వాయువేగంతో నిర్మాణం పూర్తి చేసింది.