ఈవీఎం హ్యాకింగ్‌ ఆరోపణలు ఖండించిన ఎన్నికల అధికారి

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం) హ్యాకింగ్‌పై వచ్చిన ఆరోపణలను సీనియర్ ఎన్నికల అధికారి ఖండించారు. కమ్యూనికేషన్ కోసం ఎటువంటి సదుపాయం లేని ఫూల్‌ప్రూఫ్ స్వతంత్ర పరికరం ఈవీఎం అని తెలిపారు. ఈవీఎం తెరిచేందుకు మొబైల్‌ ఫోన్‌, ఓటీపీ అవసరం లేదని స్పష్టం చేశారు. 
 
ముంబై నార్త్ వెస్ట్ స్థానంలో ఎంపీగా గెలిచిన షిండే వర్గం శివసేన ఎంపీ రవీంద్ర వైకర్ బంధువు కౌంటింగ్ సెంటర్‌లోకి మొబైల్ ఫోన్‌ తీసుకెళ్లడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓటీపీతో ఈవీఎంను తెరిచి పోలైన ఓట్ల సంఖ్యను ఆయన మార్పు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈవీఎంను హ్యాక్‌ చేశారన్న వార్తా కథనంపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి.

కాగా, రిటర్నింగ్ అధికారిణి వందనా సూర్యవంశీ ఆదివారం ముంబైలో మీడియాతో మాట్లాడారు. ఈవీఎం తెరిచేందుకు ఓటీపీ అవసరం లేదని తెలిపారు. ‘ఇది (ఈవీఎం) సాంకేతికంగా ఫూల్‌ప్రూఫ్ స్వతంత్ర పరికరం. వైర్‌లెస్ లేదా వైరు కమ్యూనికేషన్‌ పరికరం కాదు. అన్‌లాక్ చేయడానికి మొబైల్ ఫోన్‌ అవసరం లేదు. ఈవీఎంకు ఓటీపీ అవసరం లేదు. ఒక బటన్‌ నొక్కడం ద్వారా ఫలితాలు వస్తాయి’ అని ఆమె పేర్కొన్నారు.

కౌంటింగ్‌ చేయడానికి ఓటీపీ అవసరం లేదని, డాటా ఎంట్రీ చేయడానికి మాత్రం అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్‌కు ఓటీపీ వస్తుందని తెలిపారు.జోగేశ్వరి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన డాటా ఎంట్రీ ఆపరేటర్‌ దినేశ్‌ గురవ్‌ వ్యక్తిగత ఫోన్‌ మాత్రం ఒక అనధికార వ్యక్తి దగ్గర లభించిందని పేర్కొన్నారు. ఇండియా కూటమి పార్టీల నేతలు ఈ వార్తను జతచేసి సోషల్‌ మీడియా వేదికగా ఈవీఎంల విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తం చేశారు.

మరోవైపు ఈవీఎం హ్యాకింగ్‌ గురించి ఒక వార్తాపత్రిక తప్పుడు కథనాన్ని ప్రచారం చేసిందని ఎన్నికల అధికారిణి వందనా ఆరోపించారు. అబద్ధవు కథనాలను సృష్టించడానికి కొందరు నాయకులు దీనిని వినియోగిస్తున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో తప్పుడు వార్త వ్యాప్తి చేసి పరువు నష్టం కలిగించిన ముంబై వార్తాపత్రికకు ఎన్నికల సంఘం (ఈసీ) నోటీసు జారీ చేసిందని ఆమె వెల్లడించారు.