ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు బీజేపీ ఇన్‌ఛార్జ్‌లుగా కేంద్ర మంత్రులు

మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్‌, జమ్మూ కాశ్మీర్‌లలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ సోమవారం ఇన్‌ఛార్జ్‌లను నియమించింది. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మహారాష్ట్ర, జార్ఖండ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర మంత్రులు భూపేందర్ యాదవ్, శివరాజ్ సింగ్ చౌహాన్‌లను ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లుగా నియమించారు.
 
కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రి యాదవ్‌కు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మహారాష్ట్ర ఎన్నికల కో-ఇన్‌చార్జ్‌గా సహాయం చేస్తారు, వ్యవసాయ మంత్రి చౌహాన్‌కు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఎన్నికల కో-ఇన్‌చార్జ్‌గా మద్దతు ఇస్తారు. హర్యానా, జమ్మూ కాశ్మీర్‌లలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బొగ్గు శాఖ మంత్రి జి కిషన్ రెడ్డిలను ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లుగా పార్టీ నియమించింది.
 
ప్రధాన్‌కు హర్యానా ఎన్నికల కో-ఇన్‌ఛార్జ్‌గా త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ సహాయం చేస్తారు. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ లలో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే జమ్మూకశ్మీర్‌లో సెప్టెంబర్‌లోగా ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మహారాష్ట్ర, హర్యానాలలో బీజేపీ తన మిత్రపక్షాలతో కలిసి పాలిస్తోంది.
 
మహారాష్ట్రలో బిజెపి, శివసేన (షిండే), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి-అజిత్ పవార్) కూటమిగా ఉండగా, ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉన్నారు. బీజేపీకి చెందిన నయాబ్ సింగ్ సైనీ స్వతంత్రులు, చిన్న పార్టీల మద్దతుతో హర్యానా ముఖ్యమంత్రిగా ఉన్నారు.  జార్ఖండ్‌లో జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉంది. హేమంత్ సోరెన్ అరెస్ట్ తర్వాత జేఎంఎంకు చెందిన చంపై సోరెన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.
2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మహారాష్ట్ర, హర్యానాలలో బిజెపి, మిత్రపక్షాలు పేలవంగా పనిచేశాయి.  మహారాష్ట్రలో ఎంవిఎ 30 (కాంగ్రెస్ 13, శివసేన- యుబిటి 9, ఎన్సీపీ-ఎస్పీ 8 ) సీట్లు గెల్చుకోగా, బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే  కేవలం 17 సీట్లు (బిజెపి 9, శివసేన 7, ఎన్సీపీ 1) గెలుచుకోగలిగింది. జార్ఖండ్‌లో బీజేపీ- ఏజేఎస్‌యూ కూటమి 9 సీట్లు గెలుచుకోగా, ప్రతిపక్ష కూటమి 5 సీట్లు గెలుచుకుంది.