చంద్రశేఖర అజాద్‌, కార్తీక్‌ నాయక్‌లకు సాహితీ పురస్కారాలు

ప్రతిష్టాత్మకమైన సాహిత్య అకాడమీ 24 మంది రచయితలకు బాల పురస్కారాలు, 23 మంది రచయితలకు యువ పురస్కారాలు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన పమిడిముక్కల చంద్రశేఖర అజాద్‌కు బాల పురస్కార్‌ లభించింది. తెలంగాణకు చెందిన ప్రముఖ రచయిత రమేశ్‌ కార్తీక్‌ నాయక్‌ను యువ పురస్కార్‌ వరించింది. 
 
తెలుగులో పి.చంద్ర శేఖర అజాద్‌ రాసిన ‘మాయాలోకం’ నవలకు బాల పురస్కార్‌, రమేష్‌ రాసిన ‘ఢావ్లో గోర్‌ బంజారా కతలు (చిన్న కథలు) యువ పురస్కార్‌కు ఎంపికైంది. సాహిత్య అకాడమీ ప్రత్యేకంగా నిర్వహించే కార్యక్రమంలో వీరికి అవార్డులు అందించనున్నారు. అవార్డు గ్రహీతలకు తామ్రపత్రంతోపాటు రూ.50 వేల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు సాహిత్య అకాడమీ వెల్లడించింది.
 
చంద్రశేఖర అజాద్‌ 1955 మే 22న గుంటురు జిల్లా భట్టిప్రోలు మండలం వెల్లటూరు గ్రామంలో జన్మించారు. స్టేట్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌లో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. సినిమా రంగంలోను, టివి రంగంలోను రచయితగా, ఆర్టిస్టుగా కొనసాగుతున్నారు.
చంద్రశేఖర అజాద్‌కు కథల, నవలల పోటీలలో అనేక బహుమతులు లభించాయి. ఆయన నవలలు అనేక పత్రికల్లో సీరియళ్లుగా ప్రచురితమయ్యాయి. నవ్య వీక్లీ, సిపి బ్రౌన్‌ అకాడమీ నిర్వహించిన నవలల పోటీలలో ఫ్యామిలీ ఫొటో నవలకు తృతీయ బహుమతి, అమెరికా తెలుగు అకాడమీ (ఆటా), వార్త నిర్వహించిన నవలల పోటీలలో తెలిమబ్బుల ఛాయ నవలకు రూ.30 వేల నగదు బహుమతి లభించింది. తానా నిర్వహించిన నవలల పోటీలో మనో ప్రస్థానం నవలకు ప్రోత్సాహక బహుమతి, ఆంధ్రభూమి నిర్వహించిన ఉగాది కథల పోటీలో రెండు విధ్వంసాలు కథకు ప్రోత్సాహక బహుమతి వచ్చాయి.

తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లా గోర్‌ బంజారా కుటుంబంలో (జాక్రాన్‌ పల్లి తండా) జన్మించిన రమేశ్‌ కార్తీక్‌ నాయక్‌ చదువుకునే నాటి నుంచే కవిత్వం, కథలు రాయడంపై మక్కువ పెంచుకున్నాడు. గిరిజనుల జీవితాలు, మనస్తత్వాలు, సుఖ ద్ణుఖాలను లోతుగా పరిశీలించాడు.  తను చూసిన బతుకుల్ని, వెతల్ని, కథల్ని కవిత్వంలో చెప్పాలనుకున్నాడు. ఆ క్రమంలో ఇతను రాసిన తొలి కవితా సంపుటి ‘బల్దేర్‌ బండి’ 2018లో ప్రచురణ పొంది, మంచి ప్రశంసలు అందుకుంది. 
 
కేంద్ర సాహిత్య అకాడమీ ఆధ్వర్యాన నిర్వహించిన గిరిజన విద్యా సదస్సులో సన్మానం పొందారు. ఆ తర్వాత బల్దేర్‌ బండిలోని జారేర్‌ బాటి (జన్నరొట్టెలు) కవితను ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు సాహిత్యంలో ఒక పాఠంగా పొందుపరిచించి. ప్రస్తుతం సాహిత్య యువ పురస్కారానికి ఎంపికైన ఢావ్లో కథా సంకలనంలోని ‘పురుడు కథ’ ఆంగ్లంలోకి అనువాదమైంది. ఎక్స్‌చేంజెస్‌ సాహిత్య అనువాద జర్నల్‌లో ఈ కథ ప్రచురితమైంది. రమేశ్‌ కవితలు ఆంగ్లం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోకి అనువాదమయ్యాయి.