పిన్నెల్లి సోదరులపై మాచర్లలో రౌడీ షీట్

పల్నాడు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అరాచకాలు, అక్రమాలకు పాల్పడి, అల్లకల్లోలం సృష్టించిన వైసిపి మాజీ ఎమ్యెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డిలపై మాచర్ల పట్టణ పోలీస్‌ స్టేషన్లో శనివారం రౌడీషీట్‌ ఓపెన్‌ చేసినట్టు తెలిసింది. ఎన్నికల రోజు రెంటచింతల మండలం పాల్వాయిగేటులో ఈవీఎం ధ్
 
వంసం చేశారు. టీడీపీ ఏజెంట్‌ నంబూరు శేషగిరిరావుపై దాడి చేశారు. ఆ మరుసటిరోజు కారంపూడిలో వందల సంఖ్యలో అల్లరి మూకలను వెంటబెట్టుకు రోడ్లపై స్వైరవిహారం చేశారు. జనాలను భయభ్రాంతులకు గురిచేశారు. ఈ ఘటనలలో పాల్గొన్న పిన్నెల్లి సోదరులు, వెసీపీ రౌడీమూకలపై హత్యాయత్నం, పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. 
 
ఈ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రౌడీ షీట్స్‌ ఓపెన్‌ చేసినట్టు తెలిసింది. అయితే ఈ విషయంపై మాచర్ల పట్టణ పోలీసులు సమాచార ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. పోలింగ్ రోజున రెంటచింతల మండలంలోని పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో వైరల్ అయ్యింది.
 
 ఈ క్రమంలో ఆయన్ను అడ్డుకోబోయిన టీడీపీ కార్యకర్త శేషగిరిరావుపై పిన్నెల్లి అనుచరులు దాడి చేశారు. ఈ ఘటనలు జాతీయస్థాయిలో కలకలం రేపడంతో ఎన్నికల కమిషన్ వెంటనే తీవ్రంగా స్పందించాల్సి వచ్చింది. పోలింగ్ ముగిసిన మాచర్ల నియోజకవర్గం పరిధిలో కారంపూడిలో టీడీపీ కార్యకర్తలపై దాడులు జరగడంతో పిన్నెల్లి సోదరులపై కేసులు నమోదయ్యాయి. చివరకు ముందస్తు బెయిల్ కోసం ఆశ్రయించిన ఆయన న్యాయవాదిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓట్ల లెక్కింపు పూర్తయ్యేవరకు మాచర్ల వైపు వెళ్లనీయవద్దని ఆదేశించింది.
 
ఈ నేపథ్యంలోనే పిన్నెల్లి సోదరులపై రౌడీ షీట్ నమోదైనట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో పోలీసులు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఈవీఎం ధ్వంసంతోపాటు మరో నాలుగు కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుల్లో పిన్నెల్లికి జూన్ 20వ తేదీ వరకు రక్షణ కల్పించిన న్యాయస్థానం.. ముందస్తు బెయిల్ పిటీషన్ల విచారణను 20వ తేదీకి వాయిదా వేసింది.

2004 నుంచి మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి కుటుంబీకుల హవా నడుస్తోంది. 2004లో పిన్నెల్లి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో లక్ష్మారెడ్డి వారసుడిగా రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ నుంచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2012 ఉపఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి గెలిచిన రామకృష్ణారెడ్డి.. 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచారు. 

 
వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. నియోజకవర్గంలో పాతుకుపోయారు. అయితే 2024 ఎన్నికల్లో మాచర్ల నుంచి జూలకంటి బ్రహ్మానందరెడ్డిని బరిలోకి దింపిన టీడీపీ ఆయనకు చెక్ పెట్టింది. పిన్నెల్లి సోదరుల అరాచకాలపై కన్నెర్ర చేసిన ఎన్నికల కమిషన్ ఆయనతో కుమ్మక్కైన ఆరోపణలు ఎదుర్కొంటున్న జిల్లా కలెక్టర్, ఎస్పీలను సస్పెండ్ చేయడంతో పరిస్థితి మారిపోయింది. 33 వేల ఓట్లకుపైగా మెజార్టీతో పిన్నెల్లిపై జూలకంటి విజయం సాధించారు.