మేడిగడ్డలో ఆనకట్ట నిర్మాణం ఆలోచన కేసీఆర్

ఆనకట్ట నిర్మాణానికి మేడిగడ్డ అనువైన స్థలంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారని విశ్రాంత ఇంజినీర్లు విచారణ కమిషన్ జస్టిస్ పీసీ ఘోష్ ముందు చెప్పినట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ శనివారం విశ్రాంత ఇంజినీర్లతో సమావేశమయ్యారు. 

2015లో గోదావరి జలాలపై తాము ఇచ్చిన నివేదిక, సంబంధిత అంశాలను విశ్రాంత ఇంజినీర్ల కమిటీ సభ్యులు కమిషన్కు వివరించారు. ప్రాణహిత – చేవెళ్ల, కాళేశ్వరం ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలతో పాటు గోదావరి జలాల లభ్యత, కేంద్ర జల సంఘం పరిశీలనలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. ఆనకట్ట నిర్మాణానికి అనువైన స్థలంగా మేడిగడ్డను అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారని విశ్రాంత ఇంజినీర్లు కమిషన్ ముందు చెప్పినట్లు తెలిసింది.

తమ నివేదికపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి, అధికారులు సంతకాలు చేయలేదని కూడా వారు పేర్కొన్నట్లు సమాచారం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల నిర్మాణంలో సబ్ కాంట్రాక్టర్ల వ్యవస్థపై కూడా జస్టిస్ పీసీ ఘోష్ దృష్టి సారించారు. బ్యారేజీల నిర్మాణంలో ఉన్న సబ్ కాంట్రాక్టర్ల వివరాలు సేకరించే పనిలో కమిషన్ ఉంది. 

నిర్మాణ సంస్థల ఖాతాలు పరిశీలిస్తే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని, అవసరమైతే ఆర్ఓసీ నుంచి వివరాలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే ఇంజినీర్లు, నిర్మాణ సంస్థల విచారణ పూర్తయిన నేపథ్యంలో అఫిడవిట్లు అన్నీ వచ్చిన తర్వాత కమిషన్ తదుపరి కార్యాచరణ ప్రారంభించనుంది. ఈ విచారణ ఈ నెల 27 వరకు కొనసాగనుంది.

అఫిడవిట్లు అన్నీ కార్యచరణ ప్రారంభించిన తర్వాత బహిరంగ విచారణ నిర్వహించి క్రాస్ ఎగ్జామినేషన్ చేపట్టనున్నారు. ఇప్పటి వరకు ఈఈ స్థాయి వరకు ఇంజినీర్లను విచారణ చేసిన కమిషన్ కింది స్థాయిలో ఉన్న డిప్యూటీ, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లను విచారణ చేయాలా వద్ద అన్న విషయమై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.