బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌కు ఓటమి తప్పదా?

 
బ్రిటన్‌ తొలి భారత సంతతి ప్రధాని రిషి సునాక్‌కు వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదా.. అంటే ఒపీనియన్‌ పోల్స్‌ అవుననే అంటున్నాయి. ఆయన నేతృత్వంలోని కన్జర్వేటివ్‌ పార్టీ ఈ సారి తుడిచిపెట్టుకుపోతుందని ఇప్పటి వరకు మూడు సర్వేలు వెల్లడించాయి. తాజాగా మరో సర్వే కూడా జూలై 4న జరుగనున్న ఎన్నికల్లో సునాక్ ఘోరంగా ఓడిపోతారని అంచనా వేసింది.

సర్వేలో లేబర్ పార్టీకి 46 శాతం మద్దతు లభించగా, కన్జర్వేటివ్ పార్టీకి మద్దతు నాలుగు పాయింట్ల మేరకు తగ్గి 21 శాతానికి చేరుకుంది. జూన్ 12- జూన్ 14 మధ్య సండే టెలిగ్రాఫ్ పత్రిక కోసం మార్కెట్ రీసెర్చ్ కంపెనీ సావంత ఈ సర్వేను నిర్వహించింది.  ప్రజలు పోస్టల్‌ బ్యాలెట్లు అందుకోవాడానికి సరిగ్గా కొన్ని రోజుల ముందే సర్వే ఫలితాలు వెలువడటం విశేషం. రాబోయే బ్రిటన్‌ సార్వత్రిక ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ విజయానికి దూరమవుతుందని తాము నిర్వహించిన సర్వేలు చెబుతున్నాయని సావంత పొలిటికల్ రీసెర్చ్ డైరెక్టర్ క్రిస్ హాప్‌కిన్స్ తెలిపారు.

ఈ సర్వేలో 650 మంది సభ్యుల హౌస్ ఆఫ్ కామన్స్‌లో కన్జర్వేటివ్ పార్టీ కేవలం 72 సీట్లకు పరిమితమవుతుందనే అంచనాలు వెలువడ్డాయి. 200 ఏండ్ల బ్రిటన్‌ ఎన్నికల చరిత్రలో ఇదే అతి స్వల్పం. లేబర్ పార్టీకి 456 సీట్లు వస్తాయని సర్వే తెలిపింది. కాగా, మే 22న ముందస్తు ఎన్నికలను ప్రకటించి రిషి సునాక్ అందరినీ ఆశ్చర్యపరిచారు.