భారత్‌- మధ్య ప్రాచ్యాం యూరప్‌ మధ్య ఆర్థిక కారిడార్‌

* జి-7 డిక్లరేషన్‌లో వెల్లడి
ఏడు పారిశ్రామిక దేశాల బృందంగా ఏర్పడిన జి-7 దేశాలు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారిస్తూ భారత్‌- మధ్య ప్రాచ్యాంయూరప్‌ మధ్య ఆర్థిక కారిడార్‌ (ఐఎంఇసి) ఏర్పాటు ప్రతిపాదనను తెరపైకి తెచ్చాయి. దక్షిణ ఇటలీలోని బోర్గో ఎగ్నాజియా రిసార్టులో రెండు రోజుల పాటు జరిగిన సదస్సు అనంతరం
తుది డిక్లరేషన్‌ విడుదల చేశాయి. 
 
చట్టబద్ధ పాలన ప్రాతిపదికగా స్వేచ్ఛా, బహిరంగ ఇండో- పసిఫిక్‌ ప్రాంతం వుండాలని నేతలు  పునరుద్ఘాటించారు. ఈ కారిడార్‌లో సౌదీ అరేబియా, భారత్‌, అమెరికా, యూరప్‌ల మధ్య విస్తారమైన రోడ్డు, రైల్‌రోడ్‌, షిప్పింగ్‌ నెట్‌వర్క్‌ను పటిష్టపరిచేందుకు ఇది ఉపయోగపడుతుందని జి-7 డిక్లరేషన్‌ తెలిపింది. 
 
ఇది గ్రీన్‌వాల్‌ ఇనిషియేటివ్‌ అని, యూరప్‌ గ్లోబల్‌ గేట్‌వే అని ఆ ప్రకటన తెలిపింది. గతేడాది ఢిల్లీలో భారత్‌ అధ్యక్షతన జరిగిన జి 20 సదస్సులో ఈ ఇండో- మిడిల్‌ ఈస్ట్‌- యూరప్‌ ప్రతిపాదనను మొదటిసారి తెరపైకి తీసుకొచ్చారు. అల్జీరియా, అర్జెంటీనా, బ్రెజిల్‌, భారత్‌, జోర్డాన్‌, కెన్యా, మారిషస్‌, ట్యునీషియా, టర్కీ, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లను అనుసంధానిస్తూ విస్తారమైన రోడ్డు, రైల్‌, షిప్పింగ్‌ నెట్‌వర్కు ఏర్పాటు చేయడం గొప్ప ముందడుగుగా డిక్లరేషన్‌ అభివర్ణించింది. 
 
చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బిఆర్ఐ) పారదర్శకత లేకపోవడం, దేశాల సార్వభౌమాధికారాన్ని విస్మరించడంపై పెరుగుతున్న విమర్శలను ఎదుర్కొన్న నేపథ్యంలో వ్యూహాత్మక ప్రభావాన్ని పొందేందుకు ఈ కొత్త పరిపాదనను తెరపైకి తీసుకు వచ్చినట్లు స్పష్టం అవుతోంది.  చైనా బెల్ట్‌అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌లో పారదర్శకత లేదని, దేశాల సార్వభౌమత్వాన్ని విస్మరించిందని జి-7 విమర్శించింది. ”మేము మరింత కచ్చితత్వం, పారదర్శకత, జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడానికి మా ఎఐ గవర్నెన్స్‌ ద్వారా ప్రయత్నిస్తాం” అని ఆ డిక్లరేషన్‌ పేర్కొంది.
 “మేము నిర్దుష్టమైన జి7 పిజిఐఐ (అంతర్జాతీయ మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల కోసం భాగస్వామ్యం) కార్యక్రమాలు, ఫ్లాగ్‌షిప్ ప్రాజెక్ట్‌లు, నాణ్యమైన మౌలిక సదుపాయాలు, పెట్టుబడి కోసం పరివర్తనాత్మక ఆర్థిక కారిడార్‌లను అభివృద్ధి చేయడానికి పరిపూరకరమైన కార్యక్రమాలను మరింత ప్రోత్సహిస్తాము. లుజోన్ కారిడార్, మిడిల్ కారిడార్, ఇండియా- మిడిల్ ఈస్ట్- యూరోప్ ఎకనామిక్ కారిడార్, ఇయు గ్లోబల్ గేట్‌వే, గ్రేట్ గ్రీన్ వాల్ ఇనిషియేటివ్, ఇటలీ ప్రారంభించిన ఆఫ్రికా కోసం మాటీ ప్లాన్‌ లకు సహకారం అందిస్తాము”అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
 
 వినూత్నమైన, పటిష్టమైన, అందరినీ కలుపుకుని పోయే సుస్థిర అభివృద్ధి కావాలని కోరుకుంటున్నందున ఈ ప్రయత్నాల్లో రిస్క్‌ను కూడా మనం తీసుకోవాల్సి వుంటుందని డిక్లరేషన్‌ పేర్కొంది. ఈ సందర్భంగా, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పదేళ్ల భద్రతా ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. 
 
ఉక్రెయిన్‌ అధ్యక్షుడు 26 వేల కోట్ల యూరోలను సాయంగా అభ్యర్థించగా, జి-7 దేశాలు 4,700 కోట్ల యూరోల సాయాన్ని మాత్రమే ప్రకటించాయి. అమెరికా, యూరప్‌లలోని రష్యన్‌ ఆస్తులను తాకట్టుపెట్టి ఆ డబ్బును ఉక్రెయిన్‌ యుద్ధానికి వెచ్చించాలని ఏడు దేశాలు నిర్ణయించాయి.  జి-7దేశాల రెండు రోజుల సదస్సు భద్రత కోసం 8వేల మంది మిలిటరీ, సెక్యూరిటీ సిబ్బందిని మోహరించారు.