ఎలాన్​ మస్క్​- బీజేపీ నేత మధ్య ‘ఈవీఎం’ వార్

ఈవీఎంలపై టెస్లా సీఈఓ, అపర కుబేరుడు ఎలాన్​ మస్క్​ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపాయి. ఈవీఎంలను వాడకూడదని మస్క్​ అన్న మాటలకు బీజేపీ నేత ఒకరు తీవ్రంగా తిప్పికొట్టారు. “ఎలక్ట్రానిక్​ ఓటింగ్​ మెషిన్​ (ఈవీఎం)లను ఎలిమినేట్​ చేసేయాలి. మనుషులు, ఏఐ.. ఈవీఎంలను హ్యాక్​ చేసే అవకాశం తక్కువగా ఉన్నా, అది చాలా రిస్కీ,” అని ఎక్స్​లో ట్వీట్​ చేశారు మస్క్​. మస్క్​ ట్వీట్​పై బీజేపీ నేత, ఎలక్ట్రానిక్స్​- ఐటీ శాఖ మాజీ సహాయ మంత్రి రాజీవ్​ చంద్రశేఖర్​ తీవ్రంగా స్పందించారు.

“ఇవి చాలా సాధారణమైన వ్యాఖ్యలు. సురక్షితమైన డిజిటల్​ హార్డ్​వేర్​ని సృష్టించగలిగే అవకాశాన్ని ఈ వ్యాఖ్యలు వ్యతిరేకిస్తున్నాయి. తప్పు!” అన్నట్టు వ్యాఖ్యానించారు చంద్రశేఖర్​. స్టాండర్డ్​ కంప్యూటింగ్​ ప్లాట్​ఫామ్​లను వాడి ఈవీఎంలను రూపొందించే దేశాలకు మాస్క్ ఆరోపణలు వర్తిస్తాయని, అవి భారత్ కు వర్తించవని బీజేపీ నేత స్పష్టం చేశారు.

ఈవీఎంల హ్యాకింగ్ అనేది అమెరికా వంటి దేశాల్లో సాధ్యపడొచ్చని,. ఇంటర్నెట్‌తో కనెక్ట్ చేసిన ఓటింగ్ మెషీన్‌లను రూపొందిస్తారని రాజీవ్ చంద్రశేఖర్ గుర్తు చేశారు. వాటి తయారీలో సాధారణ కంప్యూట్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగిస్తారని చెప్పారు.  భారత్‌లో తయారైన ఈవీఎంలు అత్యంత సురక్షితమైనవని రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.

ఏదైనా నెట్‌వర్క్ లేదా మీడియంతో ఎలాంటి కనెక్టివిటీ ఉండదని చెప్పారు. బ్లూటూత్, వైఫై, ఇంటర్నెట్.. వంటిపై ఆధారపడి అవి పని చేయవని పేర్కొన్నారు. ఈవీఎంలను హ్యాక్ చేయడానికి ఎలాంటి అవకాశం లేని విధంగా వాటిని రూపొందించారని వివరించారు.

“భారత్ లో ఈవీఎంలు కస్టమ్​ డిజైన్​. చాలా భద్రంగా ఉంటాయి. కనెక్టివిటీ, బ్లూటూత్​, ఇంటర్నెట్​లు హ్యాక్​ చేయలేవు,” అని రాజీవ్​ చంద్రశేఖర్​ తెలిపారు. “భారత్ చేసినట్టు.. ఈవీఎంలను సరైన విధంగా, సెక్యూర్​గా తయారు చేసుకోవచ్చు. ఎలాన్​కి ఈ విషయంలో పాఠాలు చెప్పడాన్ని సంతోషిస్తా,” అన్నారు బీజేపీ నేత.

అయితే.. బీజేపీ నేత రాజీవ్​ చంద్రశేఖర్​ వ్యాఖ్యలపై స్పందించిన ఎలాన్​ మస్క్​”దేనినైనా హ్యాక్ చేసేయొచ్చు,” అని అంటూ పేర్కొన్నారు. మరోవంక, ఈ వివాదంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రవేశిస్తూ “భారత్ లో  ఈవీఎంలను బ్లాక్​ బాక్స్​గా పరిగణిస్తున్నారు. వాటిపై ఎవరికి మాట్లాడే హక్కు లేదు! మన ఎన్నికల పారదర్శకతపై తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తమవుతోంది. వ్యవస్థలు జవాబుదారీతనంతో లేకపోతే.. ప్రజాస్వామ్యం మోసానికి గురవుతుంది,” అంటూ చెప్పుకొచ్చారు.

ఈవీఎంలపై కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ ప్రకటనపై కేంద్ర మంత్రి జితన్‌ రాం మాంఝీ స్పందిస్తూ ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరగదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని, విపక్షాలు కేవలం తమ వినోదం కోసం ఈవీఎంలపై ఇష్టానుసారం మాట్లాడుతున్నాయని ధ్వజమెత్తారు.

ఈవీఎంల ట్యాంపరింగ్‌ సాధ్యమైతే వారికి అన్ని సీట్లు ఎలా వచ్చేవని ఆయన ప్రశ్నించారు. ఈవీఎంలపై ప్రశ్నలు లేవనెత్తుతూ వారు తమ బలహీనతను బయటపెట్టుకుంటున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. రాజ్యాంగం ప్రమాదంలో పడిందని గగ్గోలు పెట్టిన తరహాలో ఈవీఎంలపైనా విపక్షాలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు.