కాశ్మీర్ పాఠశాలల్లో జాతీయ గీతం తప్పనిసరి

జమ్ముకాశ్మీర్‌ పాఠశాలల్లో ఇకపై తప్పనిసరిగా జాతీయ గీతాన్ని ఆలపించాల్సిందిగా కేంద్రం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. జమ్ముకాశ్మీర్‌లోని పాఠశాలలు ఉదయం సమావేశాలను ప్రామాణిక ప్రోటోకాల్‌కు అనుగుణంగా జాతీయ గీతంతో ప్రారంభించాలని ఆదేశించారు. 

ఉదయం సమావేశాలు విద్యార్థుల్లో నైతిక సమర్థత, భాగస్వామ్య సమాజం, మానసిక ప్రశాంతతను పెంపొందించడానికి వేదికలుగా పనిచేస్తాయి. అయితే కేంద్రపాలిత ప్రాంతంలోని పాఠశాలల్లో ఇటువంటి ముఖ్యమైన ఆచారం సాంప్రదాయం ఏకరీతిగా కొనసాగించడం లేదని గుర్తించామని జమ్ముకాశ్మీర్‌లోని ప్రభుత్వ పాఠశాలలను నిర్వహించే పాఠశాల విద్యా శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

నూతన మార్గదర్శకాల్లో భాగంగా ప్రతి రోజూ ఉదయం పాఠశాలల్లో తప్పనిసరిగా జాతీయ గీతాన్ని ఆలపించాలని స్పష్టం చేసింది. పాఠశాల రోజును సానుకూల కార్యక్రమంతో ప్రారంభించేందుకు మరియు విద్యార్థుల్లో ఐక్యత, క్రమశిక్షణను పెంపొందించడానికి ఉదయం సమావేశాలను విద్యావ్యవస్థ అందించిన అమూల్యమైన ఆచారంగా గుర్తించినట్లు తెలిపింది.

8,966 ప్రాథమిక పాఠశాలలు, 7,228 అప్పర్‌ ప్రైమరీ, 1,741 ఉన్నత పాఠశాలలు, 788 ఉన్నత సెకండరీ పాఠశాలలతో కలిపి జమ్ముకాశ్మీర్‌లో మొత్తంగా 18,723 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి.