ఛత్తీస్ గఢ్ లో 8 మంది మావోలు, ఒక జవాను మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయ‌ణ‌పుర్‌లో శనివారం మరో భారీ ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. ఆ ఎదురుకాల్పుల్లో 8 మంది న‌క్స‌లైట్లు, ఒక భ‌ద్ర‌తా సిబ్బంది మృతిచెందారు. మ‌రో ఇద్ద‌రు జ‌వాన్లు గాయ‌ప‌డ్డారు. అబుజ్‌మాడ్ అడ‌వుల్లో ఉద‌యం ఎన్‌కౌంట‌ర్ మొద‌లైంది. నారాయ‌ణ‌పుర్, కంకేర్, దంతేవాడ‌, కొండ‌గావ్ జిల్లాల‌కు చెందిన భ‌ద్ర‌తా ద‌ళాలు యాంటీ న‌క్స‌ల్ ఆప‌రేష‌న్ చేప‌డుతున్న స‌మ‌యంలో ఎదురుకాల్పులు జ‌రిగిన‌ట్లు రాయ్‌పూర్ సీనియ‌ర్ పోలీసు అధికారి ఒక‌రు తెలిపారు.

నారాయణపూర్ జిల్లాలో గత రెండు రోజులుగా మావోయిస్ట్ లు, భద్రతాబలగాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.  అబూజ్ మడ్  దట్టమైన అడవిలోని ఒక కొండ ప్రాంతం. ఇది నారాయణపూర్, బీజాపూర్, దంతెవాడ జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. భౌగోళికంగా మావోయిస్ట్ లకు అత్యంత అనుకూలమైన ప్రాంతం. ఇక్కడికి చేరుకోవడం అత్యంత క్లిష్టతరం. ఈ ప్రాంతాన్ని మావోయిస్టుల కార్యకలాపాలకు కేంద్రంగా పరిగణిస్తారు.

నారాయణపూర్, కంకేర్, దంతెవాడ, కొండగావ్ జిల్లాలకు చెందిన భద్రతా సిబ్బంది సంయుక్త బృందం నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ కోసం బయలుదేరిన సమయంలో శనివారం ఉదయం అబూజ్ మఢ్ అడవుల్లో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ నాలుగు జిల్లాలకు చెందిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డి ఆర్ జి), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్ టి ఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటిబిపి) 53వ బెటాలియన్ సిబ్బంది పాల్గొన్న ఈ ఆపరేషన్ జూన్ 12న ప్రారంభమైంది.

ఈ సంవత్సరం ప్రారంభం నుంచి  ఛత్తీస్‌గఢ్‌ కేంద్రంగా మావోయిస్ట్ ల ఏరివేత కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించారు.  దండకారణ్యం వార్‌ జోన్‌గా మారింది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా దళాలు కగార్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. అబూజ్‌మడ్ అడవులే టార్గెట్‌గా జనవరి నుంచి జల్లెడ పడుతున్నాయి భద్రతా బలగాలు. 

ఏప్రిల్ 16వ తేదీన జరిగిన కాంకేర్ ఎన్‌కౌంటర్‌లో 29 మంది మావోయిస్టులు చనిపోయారు. ఆ తరువాత జరిగిన కోర్చోలి ఎన్‌కౌంటర్‌లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మే 11వ తేదీన బీజాపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోలు చనిపోయారు. నారాయణపూర్ ఎన్‌కౌంటర్‌లో 10 మంది, శనివారం నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 8 మంది మృతి చెందారు.

వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లుతోంది. దీంతో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు మావోలు. ఆదివాసీ నివాస ప్రాంతాలపై చాపర్లతో డ్రోన్‌లతో బాంబింగ్ చేస్తున్నారని మావోయిస్టులు ఆరోపిస్తున్నారు.