రుణమాఫీకి షరతులు, కోతలు విధించే యత్నం

పార్లమెంట్‌ ఎన్నికల అవసరం తీరడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీల భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నది. ఆగష్టు 15 నాటికి రూ.2లక్షల రైతు రుణమాఫీ అమలు చేస్తామని ఎన్నికల సమయంలో ప్రకటించిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఈ పధకాన్ని కొందరికే వర్తింపజేసే విధంగా కొత్త నిబంధనలను విధింపనున్నట్లు తెలుస్తున్నది. 

రుణమాఫీలో కోతలు పెట్టి, షరతులు వర్తింపజేసి మొక్కుబడిగా అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్‌ ఉద్యోగులు, ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేస్తున్న వ్యక్తులు తదితరులంతా రుణమాఫీకి దూరమయ్యే అవకాశం ఉన్నది.  ఆగస్టు 15లోగా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో అందుకు అవసరమైన నిధులను సమకూర్చుకోవడం, విధి విధానాల ను రూపొందించడంపై దృష్టి సారించిన కాం గ్రెస్‌ ప్రభుత్వం ‘అర్హుల’ సంఖ్యను కుదించేందుకు మార్గాలను అన్వేషిస్తున్నట్టు తెలిసింది. 

కేంద్రం అమలుచేస్తున్న పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం నిబంధనలను రైతు రుణమాఫీకి వర్తింపజేసేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. పీఎం కిసాన్‌ నిబంధనలను అడ్డంపెట్టుకుంటే దాదాపు 37 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉండదని భావిస్తున్నట్టు సమాచారం. 

పీఎం కిసాన్‌ పథకం ద్వారా కేంద్రం రైతులకు ఏటా రూ.6 వేల పెట్టుబడి సాయం అందిస్తున్నది. ప్రభుత్వ ఉద్యోగులు, పన్ను చెల్లించే ప్రైవేటు ఉద్యోగులు, వ్యక్తులు, రాజ్యాంగబద్ధమైన పదువుల్లో ఉన్నవారికి ఈ పథకం వర్తించదు. ఈ షరతుల కారణంగా రాష్ట్రంలోని సగానికిపైగా రైతులకు పీఎం కిసాన్‌ సాయం అందడం లేదు. 

కేంద్రం ఇస్తున్నది చాలా చిన్న మొత్తం కావడం, ఆ ఆరువేలనే మూడు విడతలుగా ఇస్తుండటంతో నష్టపోతున్న రైతులు కూడా దానిని సీరియస్‌గా తీసుకోవడం లేదు. మరోవైపు, కేసీఆర్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు ద్వారా ప్రతి సీజన్‌లో సుమారు 70 లక్షల మంది రైతులు తమకు ఉన్న మొత్తం వ్యవసాయ భూమికి పెట్టుబడి సాయం పొందుతున్నారు. 

కానీ, పీఎం కిసాన్‌ పథకం కింద 33 లక్షల మంది రైతులకే ఏడాదికి ఆరువేల చొప్పున పొందుతున్నా రు. రైతుబంధును పొందుతున్నవారిలో 37 లక్షల మంది రైతులు పీఎం కిసాన్‌ పథకాన్ని పొందలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో రుణమాఫీకి పీఎం కిసాన్‌ నిబంధనలు అమలు చేస్తే రాష్ట్రంలోని సుమారు 37 లక్షల మందికి రుణమాఫీ కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో అసలు ఎంతమంది రైతులకు, ఎంత మొత్తం రుణమాఫీ చేయాల్సి వస్తుందనే అంశంపై ప్రభుత్వం కసరత్తు చేసింది. రుణమాఫీకి సుమారు రూ.35 వేల కోట్ల నిధులు అవసరమవుతాయని సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా వెల్లడించారు. 

ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని రేవంత్‌రెడ్డి పలుమార్లు దేవుళ్ల మీద ఒట్టుపెట్టారు. అది కూడా మొత్తం రూ.2 లక్షల రుణాన్ని ఒకే దఫాలో మాఫీ చేస్తామని ప్రకటించారు. అయితే, రుణమాఫీకి అవసరమయ్యే నిధులను సమకూర్చుకోవడంలో విఫలమవుతున్న ప్రభుత్వం కోతలు విధించడం మీద దృష్టి సారించినట్టు తెలుస్తున్నది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండుసార్లు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతి రైతుకు రూ.లక్ష వరకు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేసింది. గతంలో కేంద్రంలోని మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వమైనా, ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వమైనా ఎటువంటి షరతులు లేకుండా అందరికి వర్తింపచేశారు.