తెలంగాణలో బీఆర్ఎస్ పనైపోయింది

తెలంగాణలో బిఆర్ఎస్ పని అయిపోయిందని, కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బిజేపి అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కేవలం ఐదు నెలల్లోనే ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిందని, అందుకు పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని తెలిపారు.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ తో భేటీ అయ్యారు. తరుణ్ చుగ్ ను మర్యాదపూర్వకంగా కలిసి తెలంగాణలో పార్టీ బలోపేతంపై చర్చించారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన అంశాలపై అరగంటకుపైగా చర్చించారు. 

తెలంగాణలో 8 పార్లమెంట్ స్థానాలను గెలిచిన బీజేపీ 35 శాతానికిపైగా ఓట్లు సాధించడంపట్ల సంతోషం వ్యక్తం చేసిన తరుణ్ చుగ్ నరేంద్ర  మోదీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలవల్లే ఇది సాధ్యమైందని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కేవలం ఐదు నెలల్లోనే విశ్వసనీయతను కోల్పోయిందని, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు ఉన్న నిరాశను ఎన్నికల ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయని, అసెంబ్లీ ఎన్నికల్లో అలవికాని హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేయకుండా  తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తోందన్నాని విమర్శించారు. ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ పట్ల ప్రజల్లో ఉన్న ఆగ్రహానికి అద్దం పడుతున్నాయని చెప్పారు.

ఎంపీగా, బిజెపి రాష్ట్ర అద్యక్షునిగా ఆ పదవులకే బండి సంజయ్ వన్నె తెచ్చారని  తరుణ్ చుగ్ కొనియాడారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్ ఆ శాఖకు మంచి పేరు తీసుకురావడంతోపాటు ప్రజలకు మరింత మేలు జరిగేలా పని చేస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.