45 మంది భారతీయుల భౌతికకాయాలతో కువైట్ నుంచి బయల్దేరిన భారత వైమానిక దళానికి చెందిన విమానం కేరళకు చేరుకుంది. ఉదయం 11 గంటలకు కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. కేరళకు చెందిన 12 మంది, తమిళనాడుకు చెందిన ఏడుగురు, ఏపీకి చెందిన మూడు మృతదేహాలను కొచ్చిలో దింపేసి ఈ విమానం తిరిగి ఢిల్లీకి బయల్దేరనుంది.
ఇప్పటికే విమానాశ్రయం వద్ద అధికారులు అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మృతులకు ఎయిర్‌ఫోర్ట్‌లో నివాళులు అర్పించారు. అనంతరం సిద్ధంగా ఉంచిన అంబులెన్సుల్లో మృతదేహాలను స్వగ్రామాలకు తరలించనున్నారు. ఇదిలావుండగా, ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు కువైట్ పర్యటనలో ఉన్న విదేశాంగ శాఖ సహాయమంత్రి కీర్తివర్ధన్ సింగ్, వివిధ ఆసుపత్రులలో గాయపడిన వారిని కలుసుకున్నారు. వారి యోగక్షేమాలను పరిశీలించారు. వారికి భారత ప్రభుత్వం నుండి పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.
మంత్రి తన పర్యటనలో కువైట్ మొదటి ఉప ప్రధాన మంత్రి, కువైట్ రక్షణ, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఫహాద్ యూసఫ్ సౌద్ అల్-సబాహ్, విదేశాంగ మంత్రి అబ్దుల్లా అలీ అల్-యాహ్యాలతో సహా సీనియర్ కువైట్ అధికారులతో కూడా సమావేశమయ్యారు. వారి చర్చల సమయంలో, కువైట్ విదేశాంగ మంత్రి ఈ విషాద సంఘటనపై తన సంతాపాన్ని తెలియజేసారు. వైద్య సంరక్షణ, సంఘటనపై దర్యాప్తుతో సహా పూర్తి సహాయానికి హామీ ఇచ్చారు.
కువైట్‌లోని మంగఫ్ సిటీలో బుధవారం ఉదయం 6 గంటలకు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎన్‌బీటీసీకి చెందిన 6 అంతస్తుల భవనంలో చెలరేగిన మంటల్లో అక్కడికక్కడే 49 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 45 మంది భారతీయ వలస కార్మికులు ఉన్నారు. వంట గదిలో ప్రమాదం జరిగిందని, అనంతరం మంటలు వ్యాపించాయని పోలీసులు తెలిపారు.
ప్రమాదంలో ఇరుక్కుపోయి అక్కడ వెలువడిన పొగ పీల్చడం వల్ల పలువురు కార్మికులు చనిపోయినట్టు తెలుస్తున్నది. భవనంలో దాదాపు 160 మంది కార్మికులు పని చేస్తున్నారు. చికిత్స పొందుతున్నవారిని కువైట్‌లోని భారత రాయబారి ఆదర్శ్ పరామర్శించి సంపూర్ణ సహకారం అందజేస్తామని తెలిపారు. మృతుల కుటుంబాలకు విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రమాదం జరిగిన భవనంలో కార్మికులు కిక్కిరిసి ఉన్నారని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.
More Stories
ఎవరెస్ట్‌పై మంచు తుఫానులో చిక్కుపోయిన వెయ్యి మంది
దుర్గా మాత నిమజ్జనంలో ఉద్రిక్తత.. కటక్‌లో కర్ఫ్యూ
రెండేళ్ల లోపు చిన్నారులకు దగ్గు మందు నిషేధం