
తెలంగాణలో రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలు జరిగినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడి) గుర్తించింది. ఈ కేసులో రూ. 700 కోట్ల అవినీతి జరిగినట్లు ఆరోపణలు రావడంతో మనీలాండరింగ్ నిరోధక చట్టం(పిఎంఎల్ఏ) కింద ఇడి విచారణ చేపట్టేందుకు సిద్ధం అయ్యింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య ఎండికి ఇడి లేఖ రాసింది.
గొర్రెల పంపిణీకి సంబంధించిన అన్ని వివరాలు ఇవ్వాలని ఆ సంస్థను ఆదేశించింది. గొర్రెల కొనుగోళ్ల కోసం ఏయే జిల్లాలో ఏ అధికారి ఖాతాలో డబ్బుజమైంది? ఎంత జమ చేశారు? తదితర వివరాలను ఇవ్వాలని సూచించింది. దీంతోపాటు గొర్రెల రవాణా కోసం కాంట్రాక్టు కుదుర్చుకున్న ఏజెన్సీల వివరాల గురించి కూడా ఇవ్వాలని ఇడి ఈ లేఖలో కోరింది.
కాగా, ఈ కుంభకోణంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె చంద్రశేఖరరావుపై ఈడీ కేసు నమోదు చేసినట్లు మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కోసం కొద్దిసేపటి క్రితం కేసీఆర్ కోసం ఈడీ అధికారులు వచ్చారని, ఈ విషయం ఇంకా బయటికి రాలేందంటూ గురువారం చెప్పుకొచ్చారు.
జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, వారి చిరునామా, ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతల వివరాలు వంటి సమాచారం ఇవ్వాలని ఈడి కోరింది. వారి బ్యాంకు ఖాతాల వివరాలు, వారి చెల్లించిన డిడిల సమాచారం, వాటి తాలుకూ బ్యాంకు వివరాలను కూడా ఇవ్వాలని ఇడి ఆ లేఖలో సూచించింది. వీరితో పాటు గొర్రెలు అమ్మిన వారి వివరాలు, వారి పేర్లు, వారికి చెల్లించిన బ్యాంకు వివరాలను కూడా ఇవ్వాలని ఇడి పేర్కొంది.
దీంతోపాటు జిల్లాల వారీగా గొర్రెల రవాణాకు ఉపయోగించిన వాహనాలు, ఆయా వాహనాల నెంబర్‌లతో పాటు గొర్రెల మేత కోసం వాడిన దాణా, ఆ దాణా ఎవరి దగ్గరి నుంచి కొనుగోలు చేశారు, జిల్లాల వారీగా వివరాలను, వారికి చెల్లించిన బ్యాంకు వివరాలను పేర్కొనాలని ఇడి తెలిపింది. ఇవన్నీ అందజేయాలని ఆదేశిస్తూ ఇడి లేఖ రాయడం ప్రస్తుతం తెలంగాణలో సంచలనం సృష్టించింది.
పశుసంవర్థకశాఖ మాజీ ఎండి రాంచందర్ నాయక్, అప్పటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్‌లపై ఏసిబి కస్టడీ విచారణ కొనసాగుతుండగా గొర్రెలను అమ్మిన వారికి కాకుండా ఇతర బినామీ ఏజెన్సీల వివరాల గురించి కూడా ఈడీ ఆరా తీస్తోంది.
గొర్రెలను అమ్మిన వారికి కాకుండా ఇతర బినామీ లకు డబ్బులను ఎందుకు బదలాయించాల్సి వచ్చిందన్న ప్రశ్నకు ప్రస్తుతం ఏసిబి కస్టడీలో ఉన్న అధికారులు జవాబు ఇవ్వలేదని సమాచారం. మరోవైపు గొర్రెల పంపిణీ పథకంలో అవినీతి జరిగిందన్న ఏసిబి అధికారులు ఈ కేసులో పది మంది నిందితులను గుర్తించారు. గొర్రెల పంపిణీ పథకం కుంభకోణం నిందితుల విచారణ ముగిశాక వారిని ఏసిబి అధికారులు చంచల్ గూడ జైలుకు పంపించారు. ఏసిబి అధికారులకు వీరు సరైన సమాధానం ఇవ్వలేదని సమాచారం. ఇప్పటి వరకు 10 మందిని అరెస్టు చేశారు. ఎసిబి కేసు ఆధారంగానే ఇడి దర్యాప్తు ప్రారంభించనుంది.
ఇదిలావుండగా దర్యాప్తులో భాగంగా ప్రస్తుతం జైలులో ఉన్న పశుసంవర్ధక శాఖ సిఈవో రామ్ చందర్ నాయక్, మాజీ ఓఎస్ డి కళ్యాణ్ కుమార్ లను ఏసిబి అధికారులు కోర్టు అనుమతితో అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల పాటు వీరిని విచారించేందుకు కోర్టు అనుమతినిచ్చింది.
More Stories
హైదరాబాద్ నుండి మరో రెండు వందే భారత్ రైళ్లు
పాలస్తీనాను గుర్తించిన బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా
నేటి నుంచి అమల్లోకి జీఎస్టీ కొత్త శ్లాబులు