పాక్ ఉగ్రవాది క్షమాభిక్ష పిటిషన్‌ని కొట్టేసిన రాష్ట్రపతి

పాక్ ఉగ్రవాది క్షమాభిక్ష పిటిషన్‌ని కొట్టేసిన రాష్ట్రపతి
ఢిల్లీలోని ఎర్రకోటపై 24 ఏళ్ల కిందట ఉగ్రదాడులు జరిగిన విషయం విదితమే. అయితే ఈ కేసులో దోషిగా నిర్ధారణ అయిన పాకిస్థాన్ ఉగ్రవాది మహ్మద్ ఆరిఫ్ అలియాస్ అష్ఫాక్ రాష్ట్రపతి ముందు క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేశాడు. అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము క్షమాభిక్ష పిటిషన్‌ని తిరస్కరించారు.

దాఖలు చేసుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తోసిపుచ్చినట్లు బుధవారం ఓ అధికారి తెలిపారు. రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముర్ము తిరస్కరించిన రెండో క్షమాభిక్ష పిటిషన్ ఇదే. ఈ కేసులో మహ్మద్ ఆరిఫ్‌కు న్యాయస్థానం మరణశిక్ష విధించింది.

2022 నవంబరు 3న అతడి రివ్యూ పిటిషన్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో అతనికి మరణశిక్ష ఖరారైంది. ఆరిఫ్.. మే 15న ఆరిఫ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును క్షమాభిక్ష కోరాడు. అయితే అతడి పిటిషన్‌ను ముర్ము మే 27న తోసిపుచ్చగా, 29న ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

2000 డిసెంబరు 22న ఎర్రకోట వద్ద సైనిక స్థావరంపై పాక్ ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు భారత జవాన్లు మృతి చెందారు. దాడి జరిగిన నాలుగు రోజుల తర్వాత ఢిల్లీ పోలీసులు మహ్మద్ ఆరిఫ్‌ను అరెస్ట్ చేశారు. మహ్మద్‌ను లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందినవాడి గుర్తించారు. 

మిలిటెంట్లతో కలిసి ఆరిఫ్ కుట్ర పన్నాడన్న ఆరోపణలు కోర్టులో నిరూపితమయ్యాయి. ఎర్రకోటపై దాడికి పాల్పడిన అబుబిలాల్, అబుషాద్, అబుహైదర్‌లు వేర్వేరు ఎన్ కౌంటర్లలో హతమయ్యారు. వీరంతా అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించారని 2022లో సుప్రీంకోర్టు తెలిపింది.

రాష్ట్రపతి కూడా క్షమాభిక్ష పిటిషన్‌ని తిరస్కరించడంతో మరణ శిక్ష పడటం దాదాపు నిర్ధారణ అయినట్లేనని నిపుణులు అంటున్నారు. అయితే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం సుదీర్ఘ జాప్యం కారణంగా దోషి తన శిక్షను మార్చాలని కోరుతూ ఉన్నత న్యాయస్థానం తలుపులు తట్టవచ్చని నిపుణులు భావిస్తున్నారు.